తెలంగాణా భాజపా అధ్యక్షుడిగా నియమింపబడిన డా. లక్ష్మణ్ నిన్న డిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి ఆశీర్వాదం తీసుకొన్నారు. పార్టీ అధిష్టానం ఆలోచనలకి అనుగుణంగానే పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనేది భాజపా అధిష్టానం కోరిక. అందుకోసం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొంటూ, ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడుతూ, రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పధకాల గురించి గట్టిగా ప్రచారం చేయాలని డిల్లీ పెద్దలు డా. లక్ష్మణ్ కి సూచించారు.
వారి సలహాలు చాలా సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం తెలంగాణాలో భాజపా పరిస్థితిని చూసినట్లయితే ఆవిధంగా ముందుకు సాగినా కూడా తెలంగాణాలో తెరాసకు భాజపాని ప్రత్యామ్నాయంగా మలచడం అసాధ్యమని అర్ధం అవుతుంది. తెలంగాణాలో భాజపాకి కేవలం గ్రేటర్ హైదరాబాద్ లో మంచి బలం ఉందనుకొనేవారు కానీ గ్రేటర్ ఎన్నికలలో తెరాస ద్దాటికి తట్టుకోలేక చేతులు ఎత్తేయడం అందరూ చూసారు. తమ బలహీనతలని, తెరాస బలాన్ని సరిగా అంచనా వేయడంలో దారుణంగా విఫలమయిన తెలంగాణా భాజపా నేతలు తమ ఓటమిని తెదేపాపై రుద్ది తప్పించుకొనే ప్రయత్నాలు చేసారు. అది ఆత్మవంచన చేసుకోవడమేనని చెప్పవచ్చు. దాని వలన భాజపాకే ఇంకా నష్టం కలుగుతుంది.
తెరాస ధాటికి తట్టుకోలేక భాజపా నేతలు చేతులు ఎత్తేస్తున్నప్పుడు భాజపా అధిష్టానం కొత్త వ్యూహమేదో రూపొందించుకొనే ప్రయత్నాలు చేయకుండా ఫలితం ఇవ్వని పాత పద్ధతులనే అమలుచేయామని చెప్పడం చూస్తుంటే వారికీ తెలంగాణాలో భాజపాని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందనే నమ్మకం లేదని అర్ధమవుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న కేంద్రపధకాల గురించి ప్రజలకు వివరిస్తూ, పనిలోపనిగా ‘మోడీ భజన’ కొంచెం గట్టిగా చేయాలని సూచించడం గమనిస్తే భాజపా అధిష్టానం వద్ద ప్రత్యేకమయిన వ్యూహమేమీ లేదని స్పష్టం అవుతోంది. ఎందుకంటే ఆంధ్రాలో భాజపా నేతలు గత రెండేళ్ళుగా అదే పని చేస్తున్నా ప్రజలలో భాజపా పట్ల అసంతృప్తిని తొలగించలేకపోయారు. రాష్ట్ర ప్రజలలో నెలకొన్న ఆ అపోహలు తొలగించడానికి రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభకి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యి లెక్కలు, పద్దులు అప్పజెప్పవలసి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా ప్రజలలో కూడా కేంద్ర సహాయం గురించి ఇటువంటి అపోహలే నెలకొని ఉన్నాయని భాజపా అధిష్టానం భావిస్తోంది. అది కొంత వరకు నిజమే అయినా వాటిని అపోహలని సర్ది చెప్పుకొనే బదులు ‘ఆగ్రహం’ అని నిజాయితీగా అంగీకరించగలిగితే అప్పుడు అందుకు అనుగుణంగా వ్యూహం కూడా ఆలోచించే అవకాశం కలుగుతుంది.
భాజపా అధిష్టానం సూచిస్తున్న పద్దతిలోనే ముందుకు సాగినట్లయితే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో అది ఎన్నటికీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేదని చెప్పవచ్చు. ఆంధ్రాలో తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధి కోసం దానికి అన్నివిధాల సహకరించినట్లయితే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు ఎగురేసుకువెళ్లిపోతారనే భయంతోనే పూర్తిగా సహకరించడం లేదని భాజపా నేతల మాటలే పట్టిస్తున్నాయి. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి. కనుక డిల్లీ పెద్దలు ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులతో నేరుగా మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కరించుకొనే ప్రయత్నం చేస్తే, దాని వలన మూడు పార్టీలకి, రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. తెదేపా, తెరాసల పట్ల భాజపా వైఖరి, అలాగే భాజపా పట్ల ఆ రెండు పార్టీల వైఖరి మార్చుకోవడం కూడా అత్యవసరం. అప్పుడే అది సాధ్యం అవుతుంది.