వైకాపా నుంచి మొదటి బ్యాచ్ ఎమ్మెల్యేలు వైకాపా నుంచి టేకాఫ్ తీసుకొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే వారిరువురూ తమ ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి చెపుతున్నట్లు తెలుస్తోంది. జగనన్న ఏమి చెప్పారంటే “పైన ఆ భగవంతుడు, క్రిందన ప్రజల ఆశీర్వాదాలు నాకు పుష్కలంగా ఉన్నాయి. అవి ఉన్నంత వరకు పార్టీ నుంచి ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా భయపడేది లేదు. చంద్రబాబు నాయుడుకి దమ్ము, ధైర్యం, చీము నెత్తురు ఎక్సట్రాలుంటే పార్టీలో చేర్చుకొన్న వైకాపా ఎమ్మెల్యేలందరి చేత వెంటనే రాజీనామాలు చేయించి, ఎన్నికలు పెట్టాలి. అప్పుడు ప్రజలే ఆయనకి తగిన గుణపాఠం చెపుతారు,” అని అన్నారు.
ప్రస్తుతం తెదేపా అనంతపురం వైకాపా నేతలలో ‘కదలికలు’ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆ ప్రాంతంలో భరోసా-బుజ్జగింపు యాత్రలు నిర్వహించి, అక్కడి వారికి జగన్ చెప్పిన మాటలనే రీ-ప్లే చేసి వినిపించారు.
తెలంగాణాలో తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలోకి క్యూ కట్టి వెళ్లిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే టేప్ వినిపించేవారు. ఆయన ఓ పక్క ఆ టేప్ మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే మరోపక్క పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ ఉన్నంత కాలమే ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే పార్టీలో ప్రజలకు తెలిసిన నేతలే లేనప్పుడు వాళ్ళు ఎవరిని చూసి ఆ పార్టీకి మద్దతు ఇస్తారు? కేవలం పార్టీ అధ్యక్షుడి మొహం చూసి ప్రజలు ఆధారిస్తారనుకొంటే తెలంగాణా రాష్ట్రంలో అందరూ వెళ్ళిపోయినా తెదేపా బలంగా ఉండి ఉండాలి కానీ అదిప్పుడు తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి చేరుకొంది. అదే సూత్రం వైకాపాకి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అదేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు కనుక. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి గుడ్డిగా వైకాపాకే ఓట్లేసేస్తారనుకోవడం అవివేకం, అహంభావమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అదే విశ్వసిస్తున్నట్లయితే, పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా కాపాడుకోవడానికి ఈ భరోసా-బుజ్జగింపు యాత్రలు చేపట్టనవసరం లేదు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ లాగ నిశ్చింతగా తన బిజినెస్ పనులు, సిబీఐ కోర్టు వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు కదా? కానీ పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నందుకు తీవ్ర ఆందోళన, ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేయడం గమనిస్తే పార్టీ మనుగడకి వారి అవసరం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చును. అయినా ఇప్పటికీ మళ్ళీ అదే ‘టేప్’ వేస్తుంటే దానిని ఏమనుకొవాలి?