ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలని ఓదార్చడం కోసం ఓదార్పు యాత్రలు చేసేవారు. ఆ తరువాత రైతులకి భరోసా ఇచ్చేందుకు భరోసా యాత్రలు చేసారు. ఇప్పుడు తన పార్టీలో ఎమ్మెల్యేలను ఓదార్చి, భరోసా కల్పించేందుకు ఇప్పుడు భరోసా-బుజ్జగింపు యాత్రలు నిర్వహించవలసి వస్తోంది. సాధారణంగా దీక్షలు, యాత్రలకు వైకాపాలో జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరూ చేయడానికి అనుమతి ఉండదు. కానీ పార్టీలో చాలా ‘ఎమర్జన్సీ సిట్యువేషన్’ ఏర్పడింది కనుక ఇప్పుడు జగన్ ఆ బాధ్యతలను కొందరితో షేర్ చేసుకోవడానికి సిద్దపడవలసి వచ్చింది.
విశాఖలో గుడివాడ అమర్నాథ్ రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయగా, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి భరోసా-బుజ్జగింపు యాత్రల బాధ్యత అప్పజెప్పబడింది. జగన్ కూడా కొన్నిసార్లు ‘ఆన్-లైన్’ లో అంటే ఫోన్లో నేరుగా తన ఎమ్మెల్యేలకి భరోసా కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు ఓదార్పు యాత్రల వలన వైకాపా చాలా బలపడగలిగింది కానీ విజయ సాయి, సుబ్బా రెడ్డి చేస్తున్న యాత్రల భరోసా-బుజ్జగింపు యాత్రల వలన ఎటువంటి ప్రయోజనం కనబడటం లేదు. దేని దారిదేనన్నట్లు ఒకవైపు భరోసా-బుజ్జగింపులు సాగుతుంటే మరోవైపు ఎమ్మెల్యేలు మూట ముల్లె సర్దుకొని వెళ్లిపోతూనే ఉన్నారు. ఆ కారణంగా విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు మీద ఆశలు వదులుకోక తప్పేట్లేదు.
ఫస్ట్ బ్యాచ్ కంటే సెకండ్ బ్యాచ్ లో చాలా ఎక్కువమంది ఎమ్మెల్యేలు టేకాఫ్ తీసుకోబోతున్నారంటూ పచ్చ మీడియా ఘోషిస్తోంది. వారి పేర్లు, డేట్స్, ముహూర్తాలు వగైరా ఖరారు కావడానికి చాలా లాంగ్ ప్రాసెస్ జరుగాల్సి ఉంటుంది కనుక కొంచెం టైం టేకింగ్ అవుతోందేమో. ఆ బ్యాచ్ కూడా వెళ్లిపోతే జగన్ ఆక్రోశం- లెవెల్స్ ఇంకా హై డెసిబుల్స్ లో వినిపించవచ్చు. ఈ రెండేళ్లలో అనేకమందిని ఓదార్చిన జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు ఓదార్పు అవసరమవడం చాలా విచిత్రంగా ఉంది.