ఈరోజు ఉదయం 7 గంటలకి యాకుబ్ మీమన్ని నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. రాష్ట్రపతికి అతను పెట్టుకొన్న క్షమాభిక్ష పిటిషన్ గురించి ఆయన హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ తో చర్చించిన తరువాత రాత్రి 11 గంటల సమయంలో అతని క్షమాభిక్ష పిటిషన్ని రాష్ట్రపతి తిరస్కరించారు. ఆ తరువాత కూడా ఊహించని అనేక పరిణామాలు జరిగాయి.
ఒకవైపు జైలు అధికారులు అతని ఉరికి ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అతని న్యాయవాదులు నిన్న అర్ధరాత్రి మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి హెచ్.యల్. దత్తు ఇంటి తలుపులు తట్టి యాకుబ్ ఉరి శిక్షను నిలిపివేయవలసింది కోరడంతో, ఆయన తక్షణమే స్పందించి జస్టిస్ మిశ్రా నేతృత్వంలో నిన్న ఈ కేసుని విచారించి తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనాన్ని వారి విజ్ఞప్తిని పరిశీలించమని ఆదేశించారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటిసారిగా తెల్లవారుజామున3.00 గంటలకు త్రిసభ్య ధర్మాసనం వారి పిటిషన్ని విచారణకు చేప్పట్టింది. కానీ ఈసారి యాకుబ్ తరపున వాదించిన న్యాయవాదులు బలమయిన కారణం ఏదీ చూపలేకపోయారు.మరణ శిక్ష విదించబడిన యాకుబ్ మీమన్ కి వారం రోజుల ముందుగా ‘డెత్ వారెంట్’ ఇవ్వనందున అతని హక్కులకు భంగం కలిగిందని కనుక అతని ఉరిని నిలిపివేయాలని కోరారు.
కానీ మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన భారత అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహాత్గీ వారి వాదనలను తప్పు పట్టారు. యాకుబ్ మరణశిక్షను ఏదో విధంగా వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతోనే వారు ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారని కానీ అతనికి టాడాకోర్టు మరణశిక్షని విధించినప్పుడే అతనికి డేట్ వారెంట్ అందజేసిందని కనుక మళ్ళీ కొత్తగా డెత్ వారెంట్ ఇవ్వాలని చేస్తున్న వారి వాదనలు అర్ధరహితమని, కనుక వాటిని త్రోసిపుచ్చాలని ముకుల్ రోహాత్గీ వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం సుమారు 4.30 గంటల ప్రాంతంలో వారి పిటిషన్ని తిరస్కరించడంతో యాకుబ్ మీమన్ కి శిక్ష ఖరారయింది. సుప్రీం ధర్మాసనం తుది తీర్పుని దృవీకరించుకొన్న తరువాతనే నాగపూర్ జైలు అధికారులు మేజిస్ట్రేట్ మరియు రాష్ట్ర డి.జి.పి సమక్షంలో యాకుబ్ మీమన్ని 7 గంటలకు ఉరి తీసారు.