కొన్నిరోజుల కిందల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతిని ఒకసారి గుర్తు చేసుకోండి. జన్మభూమి కమిటీల మీద ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు అన్నింటినీ రద్దు చేసేస్తున్నట్లు ప్రకటించారు. జన్మభూమి కమిటీ రూపేణా పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపేలా క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరిస్తున్నారో, తాను గుర్తించినట్లుగా, దాన్ని నియంత్రించడానికి తానెంత నిశ్చయంగా ఉన్నాడో నిరూపించేటట్లుగా ఆయన మాట్లాడారు. కానీ తాజాగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గమనిస్తే జన్మభూమి కమిటీలను నియంత్రించే విషయంలో ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారని జాలి కలుగుతుంది. పార్టీ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గారని అర్థమైపోతున్నది.
జన్మభూమి కమిటీల పేరిట జరుగుతున్న దందాలు.. ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా ఉంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ కమిటీలను మొత్తం రద్దు చేసేస్తాం అని ప్రకటించారు. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ ఇమేజి కూడాపెంచేలాగా ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్లు కూడా చెప్పారు. ఆయన మాటలు విని జన్మభూమి కమిటీల పని అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. జిల్లాల్లో సమాంతర అధికార వ్యవస్థ లాగా చెలరేగిపోతున్న ఈ కమిటీల్లో ఆందోళన మొదలైంది.
వీటి రద్దు విషయం కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం మంత్రులు చాలా మంది సమర్థిస్తూ మాట్లాడినట్లు తెలుస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అసంత్రుప్తి వస్తుందని అన్నట్లుగా తెలుస్తున్నది. వీరి మాటల ఒత్తిడి చంద్రబాబు తలొగ్గారని, అందుకే జన్మభూమి కమిటీల రద్దును రెండు నెలల పాటు వాయిదా వేశారని సమాచారం. పార్టీ నాయకుల వైపు నుంచి కూడా ఈ కమిటీల కొనసాగింపునకే వినతులు వచ్చినట్లుగా తెలుస్తోంది.