హైదరాబాద్: రామేశ్వరంలో ఇవాళ జరిగిన కలామ్ అంత్యక్రియల కార్యక్రమానికి ప్రధాని మోడిసహా పలువురు ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో వీరంతా కూర్చోవటానికి పక్కనే రెండు తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడి, ఆయన మంత్రివర్గ సహచరులు, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులంతో ఒక షెడ్లో ఆశీనులుకాగా, రెండో షెడ్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు ఉన్నారు. దాదాపు పదిహేను నిమిషాలపాటు సాగిన అంత్యక్రియలను వారంతా అక్కడనుంచి పరికించారు. రెండో షెడ్లో ఉన్న రాహుల్ ఈ పదిహేను నిమిషాలూ నిలుచునేఉండి చిదంబరం తదితర కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ రాహుల్ దగ్గరకు వచ్చి ఆయనతోనే చివరివరకు ముచ్చటిస్తూ ఉండటం విశేషం. ఇక ఖనన కార్యక్రమం ముగిసిన తర్వాత షెడ్లనుంచి అందరూ బయలుదేరుతున్నపుడు ముందుకెళుతున్న రాహుల్‌ను నిలుచుని ఉన్న చంద్రబాబు పలకరించారు. కరచాలనానికి చేయి సాచారు. రాహుల్ కూడా కరచాలనంచేసి ముందుకెళ్ళిపోయారు. ఎలాగైనా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ యువరాజావారని బాబు గౌరవించారేమో!