ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న తన మంత్రులందరికీ ర్యాంకులు ప్రకటించారు. దానిలో పంచాయితీ రాజ్ శాఖా మంత్రి అయ్యన్న పాత్రుడికి 10వ ర్యాంక్ ఇచ్చారు. అంటే ఆయన పనితీరు అసలు బాగోలేదని చెప్పినట్లే భావించవచ్చు. ఈ ర్యాంకుల ప్రకటన జరిగిన కొన్ని గంటలకే మంత్రి అయ్యన్న పాత్రుడి పౌర సంబంధాల అధికారి చాలా ఆసక్తికరమయిన విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.
“దేశంలోని అన్ని రాష్ట్రాల పంచాయితీ రాజ్ శాఖల పని తీరు ఆధారంగా ఇటీవల కేంద్రప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. దానిలో ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ అత్యుత్తమమయిన పనితీరు కనబరిచినందుకు మొదటి అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది. పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా ఈనెల 24న జంషడ్ పూర్ లో జరుగబోయే ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా మంత్రి అయ్యన్న పాత్రుడు ఆ అవార్డుని స్వీకరించబోతున్నట్లు” ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
డిజిటల్ పంచాయితీలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఆన్ లైన్ సేవలు, గ్రామాల వారీగా మాష్టర్ ప్లాన్ తయరు చేయించడం వంటి పనులను పంచాయితీ రాజ్ శాఖ చాలా చక్కగా అమలు చేస్తున్నందున ఈ అవార్డు లభించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ అవార్డు అందుకోబోతుంటే, మరి రాష్ట్ర స్థాయిలో అయ్యన్న పాత్రుడికి 10 ర్యాంక్ ఇవ్వడం ఏమిటి? అందుకు ప్రామాణికంగా మంత్రి పనితీరును చూసారా లేక రాజకీయాలను చూసారా? అనే సందేహం కలుగుతోంది. ఏమయినప్పటికీ చంద్రబాబు నాయుడు తనకి 10వ ర్యాంక్ ప్రకటించిన వెంటనే అయ్యన్న పాత్రుడు ఈ విషయాన్ని బయటపెట్టి ముఖ్యమంత్రి నిర్ణయం తప్పని చెప్పినట్లయింది.