ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీడియా ప్రచారం, ఎంత చిన్న కార్యక్రమాన్నయినా చాలా ఆర్భాటం చేయడం చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఇంతవరకు ఎవరూ చేయని పనులను చేసి ప్రచారం పొందాలనే యావ కూడా ఎక్కువే. అందుకు ఆన్ లైన్ లో ఇసుక అమ్మకాలు, గోదావరి పుష్కరాలు, పేపర్-లెస్ క్యాబినెట్ మీటింగ్, మంత్రులకు ర్యాంకింగ్, తాత్కాలిక సచివాలయంపై హెలీ పాడ్ నిర్మాణం వంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి. వాటిలో కొన్ని ఆయనకు మంచి పేరు తెచ్చి పెడితే మరికొన్ని బెడిసికొట్టడం అందరూ చూశారు. మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వడం కూడా బహుశః బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.
ఎందుకంటే మంచి ర్యాంకులు పొందిన మంత్రులు సంతోషపడవచ్చు. తమ పనితీరు గురించి గొప్పలు చెప్పుకొని అదే నోటితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నోరారా పొగడవచ్చు కానీ కొందరు మంత్రులను అందరి ముందు నిలబెట్టి “నీ పనితీరు బాగోలేదు అందుకే నీకు ర్యాంక్ ఇవ్వలేదు” అని చెప్పడం అవమానకరంగానే భావించడం సహజం. అందరికంటే చిట్టచివరి ర్యాంకులు పొందిన ప్రత్తిపాటి, మృణాలిని, నారాయణ వంటివారు దీనిని జీర్ణించుకోవడం కష్టమే. ఆ కారణంగా వారి మంత్రిపదవులు ఊడే అవకాశం కూడా కనబడుతోంది కనుక వారిలో ఆందోళన, అసంతృప్తి ఏర్పడవచ్చు. అది నేడు కాకపోతే రేపయినా ఏదో రూపంలో బయటపడటం తధ్యం. దాని వలన తెదేపాకి, ప్రభుత్వానికి ఊహించని సమస్యలు ఏర్పడినా ఆశ్చర్యం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మంత్రులకు ప్రకటించిన ఈ ర్యాంకులు ప్రతిపక్షాలకు మంచి ఆయుధాలుగా మారవచ్చును. మంత్రుల పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించుకోవడం అంటే ప్రభుత్వ అసమర్ధతను ప్రకటించుకొన్నట్లే భావించవచ్చు. కనుక ఆ పాయింట్ ఆధారంగా ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెడితే వాటికి సమాధానాలు చెప్పుకోలేక తలపట్టుకోవలసి వస్తుంది.
ఇంక ఈ కారణంగా మంత్రుల మధ్య అసూయ, అహంకారం భేదాభిప్రాయాలు ఏర్పడితే అది మరొక కొత్త సమస్య. ఒకవేళ ఏర్పడకపోతే వారి మధ్య చిచ్చు రాజేసేందుకు సాక్షి ఉండనే ఉంది. అప్పుడే అది “మంత్రుల ర్యాంకింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్” అనే శీర్షికన ఒక కధనం ప్రచురించింది కూడా. కనుక ప్రచార యావతో ముఖ్యమంత్రి చేసిన ఈ పని వలన కొత్త సమస్యలను ఆహ్వానించుకొన్నట్లే చెప్పవచ్చు.