“మరొక రెండుమూడేళ్ళు ఓపిక పట్టండి. నేను ముఖ్యమంత్రి అవగానే మీ అందరి సమస్యలు తీర్చేస్తాను,’ అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, పార్టీ నేతలకి, కార్యకర్తలకి నిత్యం భరోసా ఇస్తూనే ఉంటారు. ఆయన ఆవిధంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో చాలా భయానకమయిన పరిస్థితులు నెలకొని ఉన్నాయేమోననే అనుమానం కలుగుతుంది. ఒకవేళ ఉన్నాకూడా ఎంతో పరిపాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడే సమస్యలని పరిష్కరించలేకపోతునప్పుడు ఇంతవరకు ఒక్కసారి కూడా మంత్రిగా కూడా పనిచేయని జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యలన్నిటినీ ఏవిధంగా పరిష్కరించేస్తారో ఎవరికీ తెలియదు…ఆయన కూడా వివరించే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు.
ఆయన అంత భరోసా ఇస్తుంటే ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వైకాపా నేతలు మాత్రం నమ్మకతప్పదు. నమ్మడమే కాదు ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం చేయకతప్పదు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డి కూడా నిన్న జిల్లాలో కుంచేపల్లిలో పార్టీ నిర్వహించిన సభలో అవే ముక్కలు వల్లె వేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా దానికి ఏకైక మార్గం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమేనని తేల్చి చెప్పేసారు. అలాగే పనిలోపనిగా ఎవరూ అడగకపోయినా తనకు తెదేపా ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా పార్టీని విడిచిపెట్టి తెదేపాలో చేరే ప్రసక్తి లేదని చెప్పేరు…ఎందుకో?