ఆ మధ్యన మంత్రి రావెల కిషోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ హైదరాబాద్ లో పట్టపగలే నడిరోడ్డు మీద ఒక వివాహిత ముస్లిం మహిళ పట్ల తాగిన మైకంలో చాలా అనుచితంగా వ్యవహరించడం, అతనిని తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేయడం, దానిపై మంత్రి రావెల స్పందన, మళ్ళీ దానిపై వివాదం కారణంగా ఆయన మంత్రి పదవి ఊడిపోబోతోందని, ఆయన స్థానంలో ఒక మహిళా మంత్రిని నియమించబోతున్నారాని మీడియాలో చాలా ఊహాగానాలు వినిపించాయి. కానీ మంత్రిగారి కుమారుడు అంత హడావుడి చేసినా ఆ తరువాత ఆ కేసు గురించి మళ్ళీ ఎన్నడూ వినబడలేదు. అంతే కాదు మంత్రి పదవి ఊడిపోతుందనుకొన్న రావెల కిషోర్ బాబుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా మంచి ర్యాంక్ ఇవ్వడం విశేషమే. ముఖ్యమంత్రికి కుడిభుజంగా పేరు తెచ్చుకొని, ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్న మునిసిపల్ శాఖా మంత్రి పి నారాయణ కంటే కూడా రావెల కిషోర్ బాబుకి మంచి ర్యాంక్ సంపాదించుకోవడం గమనిస్తే ఆయన మంత్రి పదవికి డోకా లేదనే భావించవచ్చు. అయితే నారాయణ పేరు ఆ జాబితాలో అట్టడుగున ఉండటంతో ఆ అందులో ఏమయినా అచ్చు తప్పులున్నాయేమోనని చాలా మంది ధర్మ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది పేపర్ లెస్-మంత్రి వర్గసమావేశం కనుక అచ్చు తప్పులకు అవకాశం లేదు. బహుశః రాజధాని భూసేకరణ సమయంలో ఆయన స్పీడ్ చాలా ఎక్కువయిపోయినందునే ముఖ్యమంత్రి ఆయనను బ్యాక్ బెంచీలోకి పంపించేసారని మరికొందరి వాదన. ఎవరి వాదనలు ఎలాగున్నప్పటికీ ఆయన పరిస్థితే ఇప్పుడు ఎవరికీ అర్ధం కావడం లేదు. అప్పుడు రావెల ఇప్పుడు నారాయణ తరువాతః ఎవరో అని గిట్టనివాళ్ళు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.