కుమారుడు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయం విస్తరణ సమయంలో చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారంటే తీసుకుంటాం అనే అర్థం. నిజానికి అయన ఆశీస్సులు లేకుండా ఆమోదించకుండా అంతమంది మంత్రులు ప్రజా ప్రతినిదులు లోకేష్ రావాలని సామూహిక ప్రకటనలు చేయడం జరగదని అందరికీ తెలుసు. అయితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వ్యర్ధమై మామూలు మంత్రిగా రావడం ఒక విధంగా కొరతే.
తెలంగాణాలో రేవంత్ తో పాటు వోటుకు నోటులో భాగం పంచుకోవడం లోకేష్ కి పెద్ద దెబ్బ. జిహెచ్ఎంసి ఎన్నికలలో తుడుచిపెట్టుకు పోవడం మలిదెబ్బ. ఆయన ఏరికోరి టికెట్ ఇప్పించిన వారంతా తెరాసలో చేరిపోవడం కూడా లోకేష్ కు అప్రతిష్టే తెచ్చిపెట్టింది. ఇలాటివి మరెవరివల్లనైనా జరిగివుంటే చంద్రబాబు అస్సలు సహించేవారు కాదు. కాని కొడుకును వదులుకోలేరు గనక రేపు అన్నిటికి ఆయనపైనే ఆధారపడాలి గనక మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నారన్న మాట.
ఈ దెబ్బతో జాతీయ వ్యూహాలు మటుమాయమైపోక తప్పదు. అసలు హరికిషన్ సింగ్ సూర్జిత్ వంటి ఉద్దండుల అండ ఉన్నదుకే చంద్రబాబు అప్పుడు డిల్లీలో చక్రం తిప్పారన్నది వాస్తవం. వాజపేయి ప్రభుత్వము అధికారంలోకి రావడానికి మొదటి కారణం తెలుగు దేశం మద్దతే అయినా అదివరకటి గౌరవం దక్కలేదు. ఇక ఇప్పుడు మోడీ సర్కారు, రాష్ట్రంలోని బిజెపి నేతలు (వెంకయ్యనాయుడు మినహా) తెలుగు దేశంను గుదిబండగానే చూస్తున్నారు. కనుక లోకేష్ ని డిల్లీకి పంపవద్దనే చంద్రబాబు కచ్చితంగా అనుకున్నారు. రాజ్యసభ ఊహాగానం కూడా ఆ క్రమంలో భాగమే.
ఇక ఇప్పుడు కుమారున్నిఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేసి వారసుడిగా స్థిరపర్చేందుకు ప్ర్రాదాన్యత ఇస్తారు. కేటిఅర్ పోలిక ఎలాగూ తోడ్పడుతుంది. హైదరాబాద్ బిడ్డ , అక్కడ తండ్రి ఇక్కడ కొడుకులాటి ఆశలకు ఇది ఫుల్ స్టాప్ కావలిసిందే. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ కుటుంబంలోని ఇతర వారసుల సభ్యల స్పందన ఎలా ఉంటుంది…అడ్డుకోలేక పోయినా అసంతృప్తి పెరగదా…లాటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే అధికారం ఉన్నవారి నిర్ణయాలపై ఉడుక్కోవడం తప్ప ఇప్పటికిప్పుడు వారెవరు చేయగలిగింది ఉండదు. బాలక్రిష్ణ గురించి ప్రశ్న అడగలేదు గాని నిజానికి ఆయనకు కూడా సిఎం కాకున్నా మంత్రి పదవైనా ఇవ్వపొతే ఊరుకునేలా లేరని అధికార పార్టీ వర్గాల సమాచారం.