ఓటుకి నోటు కేసులో తెదేపాని, తెదేపా ప్రభుత్వాన్ని, అందరినీ ఇరుకున పెట్టిన వాటిలో కాల్ డాటా రికార్డ్స్ కూడా ఒకటి. ఆ కేసు నుంచి వారిని సురక్షితంగా బయటపడేసినవి కూడా అవే అంటే ఫోన్లే (ఫోన్ ట్యాంపరింగ్) కావడం మరో విచిత్రం. లేకుంటే ఏమయ్యేదో ఊహించుకోవడం కూడా కష్టమే. మళ్ళీ ఇప్పుడు అవే సెల్ ఫోన్ టవర్లతో తెదేపా ప్రభుత్వం ఓ ఆటాడుకోవడానికి సిద్దం అవుతుండటం విశేషం.
నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇకపై రాష్ట్రంలో సెల్ ఫోన్ టవర్లన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయించారు. దాని కోసం ప్రత్యేకంగా టవర్స్ కార్పోరేషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెల్ ఫోన్ సర్వీస్ అందిస్తున్న కంపెనీలు ఆ సంస్థ ఏర్పాటు చేసే టవర్లకి నిర్ణీత రుసుము చెల్లించి వినియోగించుకోవలసి ఉంటుంది. ఆ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసే సెల్ టవర్లనే ప్రైవేట్ సెల్ ఫోన్ సంస్థలన్నీ వినియోగించుకోవాలి తప్ప అవి స్వయంగా ఎక్కడా సెల్ టవర్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలులేదు.
ప్రైవేట్ సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు రాష్ట్రంలో జనావాసాల మధ్య ఇష్టం వచ్చినట్లు సెల్ టవర్లు ఏర్పాటు చేయడం వలన వాటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా ప్రజలకు రకరకాల రోగాల పాలవుతున్నారు. ప్రభుత్వమే సెల్ టవర్లు ఏర్పాటు చేసి నిర్వహించినట్లయితే ఆ సమస్య కొంత మేర తగ్గుతుంది అలాగే సెల్ టవర్ల వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. కానీ టెలికాం సంస్థ అధీనంలో ఉండే ఈ రకమయిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా నిర్వహిద్దామనుకొంటోందో పూర్తి విధివిధానాలు చూస్తేగానీ చెప్పలేము
మన దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం మొబైల్ ఫోన్లు వాటి సేవలు. అది చూసే అనేక వందల సర్వీస్ ప్రొవైడర్లు, సెల్ ఫోన్ తయారీ కంపెనీలు పుట్టగొడుగులలాగ పుట్టుకొస్తున్నాయి. మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు ఇప్పుడు పల్లీలు, బటానీలు అమ్మినట్లు అమ్మేస్తున్నారు. వాటిపై ప్రభుత్వ నియంత్రణ చాలా పరిమితంగా ఉన్నందునే అంత వేగంగా అభివృద్ధి సాధ్యం అయింది. వారు డిమాండ్ కి తగినట్లుగా అవసరమయిన చోట సెల్ టవర్లు ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వమే స్వయంగా సెల్ టవర్లు ఏర్పాటు చేసి, అదే నిర్వహించదలిస్తే మొట్టమొదట జరిగేది అవినీతే. ఆ టవర్లనే తప్పనిసరిగా వాడాలని సర్వీస్ ప్రొవైడర్లను ఒత్తిడి చేస్తే వారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలుంటాయి. ప్రభుత్వ నిర్వహణ ఏవిధంగా ఉంటుందో దానిలో అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ సంస్థ అధీనంలో ఉండే సెల్ టవర్ల నుంచి సిగ్నల్ సేవలు పొందడానికి సర్వీస్ ప్రొవైడర్లు నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. అది వారి సేవలపై, అందుకు వారు వసూలు చేస్తున్న ధరలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కనుక ఈ ప్రతిపాదనను సర్వీస్ ప్రొవైడర్లు అందరూ వ్యతిరేకించవచ్చు.
ప్రభుత్వం యొక్క కర్తవ్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంగా ఉండాలి. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మద్యం, రియల్ ఎస్టేట్, ఇప్పుడు తాజాగా సెల్ టవర్ల వ్యాపారాలలో కూడా ప్రవేశించాలనుకొంటున్నాయి. ఇటువంటి ఆలోచనలు లేదా ప్రయోగాల వలన ప్రభుత్వానికి కొత్త సమస్యలు సృష్టించుకొన్నట్లే అవుతుంది తప్ప ఆశించినట్లు ఆర్ధిక ప్రయోజనమేమీ సమకూరకపోవచ్చు.