కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై ఆర్థిక కేసులు వచ్చినప్పటికీ రాజ్యసభకు మళ్లీ పంపడం ఖాయమని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అరెస్టు వారంటు వరకూ వెళ్లడంపై ప్రదాని మోడీ కూడా సీరియస్ అయినప్పటికీ తన మంత్రివర్గంలోవారెవరినీ తొలగించకూడదనే భావం ఆయనకు బలంగా వుందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన తెలుగుదేశం ద్వారానే సుజనా చౌదరిని పక్కకు తప్పిస్తారని కొన్ని కథనాలు వచ్చాయి. ఇటీవల ఒక సమావేశంలో సుజనా చౌడరి బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే నిరుత్సాహంగా కనిపించిందని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇంతవరకూ తమకు అలాటి ప్రతికూల సంకేతాలేమీ రాలేదని సుజనా చౌదరి అనుయాయులు అంటున్నారు. గతంలో పార్టీ ఇబ్బందులలో వున్నప్పుడు నిర్వహించిన పాత్రతో పాటు భవిష్యత్తులో కూడా ఏదైనా చేయాలంటే అలాటి వారు వుండటం అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు చెబుతున్నారు.లోకేష్‌ను పంపించి సుజనాను ఆపేస్తారని కొందరు చెప్పిన కథలు ఇప్పుడు ఎలా తేలిపోయాయో చూడాలని వారు చెబుతున్నారు. వెంకయ్య నాయుడు కూడా ఎపి నుంచి రాజ్యసభకు వెళ్లడానికి ఇష్టపడబోరని ఆయన సన్నిహితుల అంచనాగా వుంది. దానివల్ల తనపై ఒక రాష్ట్రం తరపున పనిచేయాలనే ఒత్తిడి పెరుగుతుందని ఆయన బావిస్తున్నారట. ఇవన్నీ గమనించినప్పుడు సుజనా చౌదరి రీనామినేషన్‌కు ఇబ్బంది వుండదనే అనుకుంటున్నారు. ఏమైనా చిన్న చిన్న చిక్కులువున్నా తొలగిపోయినట్టు హైకోర్టులో ఆయనపై అరెస్టు వారంటు రద్దు చేయడం వల్ల చెబుతున్నారు. అసలు ఢిల్లీలో ఏ పనైనా చంద్రబాబు సుజనా చౌదరికే అప్పగించడం వాస్తవమని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్నారు. మళ్లీ టికెట్ రాదని వాదించిన ఒక నాయకుడు కూడా భారీ విరాళం అందిస్తే ఏమవుతుందని ప్రశ్నించినప్పుడు అలా అయితే తనకే రావచ్చునని ముక్తాయించడం విశేషం!