తెలంగాణాలో తెదేపా, వైకాపాల పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. తెలంగాణా నుంచి వైకాపా ఒకటే అదృశ్యం అయిపోతుందనుకొంటే దానితో బాటు తెదేపా కూడా మాయమయిపోయేలా ఉంది. తెరాసకు గుణపాఠం చెప్పాలనుకొంటే తెదేపా నేతలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని వి.హనుమంతరావు ఒకసారి సూచించారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కనుక తెదేపా నేతలు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. ప్రస్తుతం తెదేపాలో ఎల్.రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు వంటి నలుగురైదుగురు నేతలే కనిపిస్తున్నారు.
తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తన పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా ఎంత కాలం కొనసాగించగలరో తెలియదు. ఒకవేళ వచ్చే ఎన్నికల వరకు పోరాడినా దాని వలన రాష్ట్రంలో మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం సాధించడం అసంభవమని భావించవచ్చు. ఈ పరిస్థితులలో వారి ముందు కనబడుతున్న మార్గం తెరాస లేదా భాజపాలో చేరిపోవడమే. వారు తెరాసలో చేరడం అసంభవం కనుక భాజపాలోనే చేరవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే తెలంగాణాలో తెదేపాని భాజపాలో విలీనం చేయవచ్చు కూడా కానీ, ఆవిధంగా చేస్తే ఆంధ్రాలో తెదేపాకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి.
తనకు నమ్మకస్తులు, అత్యంత సన్నిహితులయిన ఆ తెదేపా నేతల రాజకీయ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని వారిని భాజపాలో చేరేందుకు అనుమతించవచ్చు. ప్రస్తుతం తెలంగాణాలో భాజపాకి బలమయిన నేతలు లేరు కనుక ఒకవేళ వారు పార్టీలో చేరాలనుకొంటే భాజపా వారినందరినీ సాదరంగా ఆహ్వానించవచ్చు. అయితే వారందరికీ పార్టీలో తగిన గౌరవం, పదవులు కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలకి మరికొంత సమయం పట్టవచ్చునేమో కానీ ఏదో ఒకరోజున ఇదే జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే తెలంగాణా తెదేపా నేతల ముందు ఇంతకంటే మంచి మార్గం మరొకటి మిగిలి లేదు. అదే జరిగితే దాని వలన ఆంధ్రాలో తెదేపా-భాజపాల బంధం బలపడే అవకాశం కూడా ఉంటుంది. కనుక చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించవచ్చు.