హైదరాబాద్: ఈ ఉదయం ఉరిశిక్ష అమలుచేయబడిన యాకూబ్ మెనన్ చివరికోరిక తీరకుండానే ప్రాణాలు విడిచాడు. ఉరిశిక్ష అమలుచేసేముందు ఖైదీలను చివరికోరిక అడగటం రివాజు. యాకూబ్ తన కుమార్తె జుబేదాతో మాట్లాడలని ఉందని చెప్పాడు. అయితే దానికి సమయంలేకపోవటంతో, ఫోన్లో కుమార్తెతో మాట్లాడించారు. యాకూబ్‌ను అతని 53వ పుట్టినరోజునాడే, ఇవాళ ఉదయం ఏడుగంటలప్రాంతంలో ఉరితీశారు. పోస్ట్‌మార్టమ్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాకూబ్ సోదరులు సులేమాన్, ఉస్మాన్‌లకు ఉదయం 9.30గంటల ప్రాంతంలో జైలు అధికారులు మృతదేహాన్ని అప్పగించారు. దానికిముందు, మృతదేహంతో ఎలాంటి ప్రదర్శనలూ, ఊరేగింపులూ నిర్వహించబోమని వారినుంచి లిఖితపూర్వక అంగీకారపత్రాన్ని తీసుకున్నారు. సులేమాన్, ఉస్మాన్ మృతదేహాన్ని తీసుకుని 9.45గంటలకు నాగపూర్ విమానాశ్రయంనుంచి ముంబాయికి బయలుదేరారు. 12.10గంటలకు వారు ముంబాయి చేరుకున్నారు. విమానాశ్రయంనుంచి ఇంటికి, స్మశానానికి తీసుకెళ్ళేటపుడు ఫోటోలు తీయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటిగంటప్రాంతంలో యాకూబ్ మృతదేహం మాహిమ్ ఏరియాలోని అతని ఇంటికి చేరుకుంది. మరోవైపు యాకూబ్ ఉరి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.