వైవిఎస్ చౌదరిది విభిన్నమైన స్టైల్. పరాజయాల్ని లెక్క చేయడు. తాను నమ్మిన దారిలోనే వెళ్తాడు. సినిమా చిన్నదా, పెద్దదా చూడడు. స్టార్‌కి మార్కెట్ ఉందా, లేదా… లెక్కవేయడు. తన సినిమా అనుకొన్నట్టు రావడానికి ఎన్ని కోట్లయినా ఖర్చుపెడతాడు. రేయ్ కోసం కూడా అలానే కోట్లు కుమ్మరించాడు. కానీ ఫలితం రాలేదు. పైగా సగానికి సగం నష్టపోయాడు. ఈసినిమాతో ఆస్తులలన్నీ అమ్ముకోవాల్సివచ్చిందని చౌదరిపై టాక్ కూడా వినిపించింది. అందుకే ఏయ్ తరవాత కొంతకాలం వైవిఎస్ చౌదరి నుంచి ఎలాంటి అలికిడీ లేదు. ఇప్పుడు మళ్లీ ఓ స్ర్కిప్టు పట్టుకొని సినిమా చేయడానికి రెడీ అయిపోయాడని టాక్.
ప్రేమ, కుటుంబ బంధాలతో కథలు అల్లుకోవడం వైవిఎస్ శైలి. అయితే ఈసారి తన అభిరుచికి భిన్నంగా, ప్రస్తుత ట్రెండ్‌కి అనుగుణంగా ఓ పవర్‌ఫుల్ యాక్షన్ స్టోరీ రాసుకొన్నాడట. ఓ అగ్ర హీరోతో ఆ సినిమా చేయాలని పట్టుదలతో ఉన్నాడు. వైవిఎస్ ట్రాక్ రికార్డు చూస్తే అగ్ర కథానాయకులెవ్వరూ సులభంగా ఛాన్సులివ్వరు. కానీ వాళ్లకు మెప్పించడంలో వైవిఎస్ ఘటికుడే. ఏదో ఓ మాయ చేసి.. టాప్ హీరో డేట్లు పట్టేయడం ఖాయంలా కనిపిస్తోంది. మరి వైవిఎస్ కథకు బౌల్డ్ అయ్యే ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.