ఏదయినా ఒక అంశాన్ని ఒక ప్రత్యేక కోణంలోంచి చూడాలంటే అది కేవలం రాజకీయ నేతలకే సాధ్యమేమోనని పిస్తుంది వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వింటే. ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నందున చాలా మంది ప్రజలు వడదెబ్బ తగిలి మృతి చెందుతున్నారు. వారిలో రెక్కాడితేగాబ్ని డొక్కాడని నిరుపేదలే ఎక్కువ. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా కూడా ప్రజలకి రోడ్ల మీద రాక తప్పదు. అటువంటి వారందరికీ కాస్త దప్పిక తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 7200 చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో చల్లటి మంచినీళ్ళు, మజ్జిగతో బాటు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వడదెబ్బ తిన్న వారికి చికిత్స చేసేందుకు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలని నిశ్చయించింది. ఈ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.39 కోట్లు కేటాయించింది.
దీనిని అంబటి రాంబాబు వైకాపా కోణంలో నుంచి చూపించారు. ఏవిధంగా అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు చెందిన హెరిటేజ్ కంపెనీలో పాలు, మజ్జిగని అమ్ముకోవడానికే ఈ నిర్ణయం తీసుకొన్నారు తప్ప ప్రజల కోసం కాదు. ఆ డబ్బు మొత్తం నేరుగా లోకేష్ జేబులోకే వెళుతుంది,” అని అంబటి ఆరోపించారు.
రాష్ట్రంలో అనేక జిల్లాలలో ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు లేక బాధపడుతుంటే ముఖ్యమంత్రి రాజ్యసభ సీట్ల పంపకాలు, మంత్రులకు ర్యాంకుల గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేయడం రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకొంటూ కూర్చోన్నట్లుందని విమర్శించారు.