తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట రెడ్డి ఆకస్మిక మృతితో ఖాళీ అయిన ఆ స్థానాన్ని మళ్ళీ భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం మంగళవారం ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 22న ఉపఎన్నిక ప్రకటన వెలువడుతుంది. అదే రోజు నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మే2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవలసి ఉంటుంది. దక్షిణాదిన కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలతో బాటు మే16న పాలేరు ఉపఎన్నికలు కూడా నిర్వహించి, వాటితో బాటే మే19న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది కనుక పాలేరులో నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలలో తెరాస పార్టీయే వరుస విజయాలతో దూసుకుపోతోంది కనుక పాలేరులో కూడా ఘన విజయం సాధించవచ్చు. అయితే అక్కడి నుంచి ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన కుమారుడుకి ఆ టికెట్ ఇవ్వాలని కోరుతుండగా, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తను సూచిస్తున్న అభ్యర్ధికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వీరిరువురూ కాక, బయట పార్టీ నుంచి కూడా టికెట్ కోసం ఒత్తిడి రావడం విశేషం. రాష్ట్ర వైకాపా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లయితే తెరాసలో చేరిపోయి వైకాపాను పార్టీలో విలీనం చేస్తానని చెపుతున్నట్లు సమాచారం. వరుస ఓటములతో డీలాపడున్న తెదేపా, భాజపాలు ఆ కారణంగా ఒకదానికొకటి కొంచెం దూరం అయ్యేయి కనుక ఈ ఉపఎన్నికలలో అవి కలిసే పోటీ చేస్తాయో లేక విడివిడిగా పోటీ చేస్తాయో, అసలు పోటీయే చేయవో ఇంకా తేల్చుకున్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం తధ్యమే కానీ ఇంకా తన పార్టీ అభ్యర్ధి పేరు ఖరారు చేయలేదు.