రాష్ట్ర రాజకీయాల్లో ఎడాపెడా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, తమ పార్టీనుంచి ఎమ్మెల్యేలు, మండలస్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వెళ్లిపోతూ ఉండడం, ఇంకా మరింతగా తమ పార్టీ నుంచి పలువురిని చేర్చుకోవడానికి అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహరచనలు చేస్తూ ఉండడం … ఇలాంటి నేపథ్యంలో జగన్మోహనరెడ్డి తన శైలి మార్చారు. తన పోరాటాన్ని రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబునాయుడు మీదకంటె, ఏకంగా చట్టం మీదికే మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నదంటూ ఎంత లావు పోరాటం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదని, అయితే ఆయనకు అలాంటి చర్యలకు పాల్పడే అవకాశం కల్పిస్తున్న ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాల మీదనే పోరాడాలని జగన్ తాజా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నది.
ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎంపీల మీద అనర్హత వేటు పడేలా మరింత దూకుడుగా పోరాడాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలుస్తున్నది. దీని కోసం ఢిల్లీస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేయాలని అనుకుంటున్నారు. నమ్మి టికెట్లు ఇచ్చి ప్రోత్సహించిన నాయకులంతా.. పార్టీకి నష్టం కలిగించేలా.. ఇలా ఫిరాయించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లే తెలుస్తున్నది.
ఈ నెలలోనే పార్లమెటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆసమయంలో ఢిల్లీ వెళ్లి.. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాలమీదనే పోరాటం చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.
అచ్చంగా జగన్ ఆలోచన కొన్ని రోజుల కిందట తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాల మాదిరిగానే ఉండడం విశేషం. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి కూడా పార్టీ మారిపోయిన నేపథ్యంలో ఆగ్రహించిన జానా.. అసలు ఫిరాయింపు నిరోధక చట్టం మీదనే పెద్దగా పోరాటం చేయాలని అప్పట్లో ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. జగన్ కూడా ఇప్పుడు అదే మాటలు చెబుతున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప.. ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలో మార్పులు చేర్పులు సాధ్యం కాకపోవచ్చు. మరి, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు కొందరు జారుకోగానే ఆవేశంలో ప్రకటించడమేనా, అంతదూరం పోరాటాన్ని నడిపించే ఓపిక ఈ పార్టీలకు ఉన్నదా అనేది మాత్రం అనుమానమే.