ఏపిలో మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం తెదేపాకి, ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. వాటిలో అతితక్కువ ర్యాంకులు వచ్చిన మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. ఆయన నిన్న వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ “అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. అవి మంత్రులు తమ పనితీరు మెరుగుపరచుకోవడానికే తప్ప ఇతర పార్టీలు దానిపై చర్చిండానికి కాదు,” అని చెప్పారు.
ఆయన సంజాయిషీ చెప్పుకోవలసిరావడమే, వాటి వలన పార్టీ, ప్రభుత్వం ఎంత ఇబ్బందిపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధులయిన మంత్రులకు మంత్రివర్గ సమావేశంలో ర్యాంకులు ప్రకటించి, దానిపై విమర్శలు మొదలవగానే అది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని కళా వెంకట్రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మంత్రివర్గ సమావేశం అంటే పార్టీ సమావేశంగా భావిస్తున్నట్లున్నారు. అందుకే దానిని పార్టీ వ్యవహారంగానే ఆయన భావిస్తున్నట్లున్నారు.