బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన, వారి అనుచరులు ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. ఈ విషయం ఇప్పటికే వార్తలలో వచ్చింది. తెదేపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు కూడా ఈ విషయాన్ని నిన్న దృవీకరించారు. వారి నిష్క్రమణతో బొత్స సత్యనారాయణకి ఇంకా జిల్లాలో ఎదురు చెప్పేవారుండరు కనుక మళ్ళీ జిల్లా రాజకీయాలపై తన పట్టును పెంచుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. సుజయ కృష్ణ రంగారావు సోదరులు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో సత్సంబంధాలున్నాయి కనుక వారికి ఆయన పూర్తి సహకారం అందించవచ్చు కానీ జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నేతల నుంచి సహకారం పొందడమే కొంచెం కష్టం కావచ్చు. ఒకవేళ జిల్లాలో పార్టీ నేతలతో కూడా వారు సయోధ్య కుదుర్చుకోగలిగితే ఇంక వారికి తిరుగు ఉండదు. అప్పుడు జిల్లాలో తెదేపా, వైకాపాల బలాబలాలు సమానమయ్యే అవకాశం ఉంటుంది.
సుజయ కృష్ణ రంగారావుకి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సాక్షి మీడియాలో వార్తలు వచ్చేయి. ఆ కారణంగా జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్న తెదేపా నేతలలో అసంతృప్తి నెలకొని ఉండవచ్చు కానీ చంద్రబాబు నాయుడు ఆయనకి నిజంగానే మంత్రి పదవి ఇస్తానన్నారా లేదా అనే దానిపై తెదేపాలో ఎవరూ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేకపోతే పార్టీ పదవి లేదా నామినేటడ్ పదవి ఇస్తారేమో?