అతిథి పాత్రల హంగామా ఎక్కువైపోయింది. పట్టుపని పది సెకన్లు లేని పాత్రల్లో అతిథిలా మెరిసి మాయమైపోవడానికి సైతం హీరోలు రెడీ అంటున్నారు. పరిశ్రమలో ఇదో మంచి సంప్రదాయమే అనుకోవచ్చు. తాజాగా నారారోహిత్ అతిథి పాత్రలో మెరవబోతున్నాడు. అదీ… త్రిష నటించిన నాయకి సినిమా కోసం. త్రిష మూడు పాత్రల్లో నటిస్తోన్న చిత్రం నాయకి. గోవి దర్శకుడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఇందులో నారా రోహిత్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు గోవి స్వయంగా ప్రకటించారు కూడా.
నాయకిలో నారా రోహిత్ కనిపించేది ఒక్క సన్నివేశంలోనేనట. అయితే.. ఆ సన్నివేశం ఈ సినిమాకి మలుపు తిప్పుతోందని తెలుస్తోంది. అందుకే నారా రోహిత్ … అడిగిన వెంటనే ఒప్పుకొన్నాడట. త్రిషకు ఈ సినిమా చాలా కీలకం. తన కెరీర్ ముందుకు సాగిపోవాలన్నా, ఆగాలన్నా ఈ సినిమాపైనే ఆధారపడి ఉంది. అందుకే.. అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకొంది. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తారు.