తెలంగాణా కాంగ్రెస్ పార్టీలోసీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసారు. ఇటీవల పార్టీ కార్యవర్గం ఏర్పాటులో తనకు అన్యాయం జరిగిందనే అసంతృప్తితో రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖల కాపీలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాద్యక్షుడు రాహుల్ గాంధికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. పార్టీలో సీనియర్ అయిన తనను ఏమాత్రం పట్టించుకోకుండా పార్టీ కార్యవర్గం ఏర్పాటు చేసారని, అందుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు పొంగులేటి తన లేఖలో పేర్కొన్నారు. ఆయనని రాష్ట్ర పిసిసి కార్యవర్గంలో, సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ పదవులకి కూడా ఆయన ఈరోజు రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కనుక పార్టీ మారే ఆలోచన లేదని భావించవచ్చు. పిసిసికి అతిపెద్ద జంబో కార్యవర్గం ఏర్పాటు చేసి పార్టీలో ఉన్న సీనియర్లందరికీ కూడా తలో పదవి పంచిపెట్టినప్పటికీ ఇంకా అసంతృప్తి కనబడటం ఆ పార్టీలో నేతల తీరుకి అద్దం పడుతోంది. తెలంగాణాలో తెరాస ధాటికి పార్టీ తుడిచిపెట్టుకు పోతుంటే, తెరాస బారి నుంచి పార్టీని కాపాడుకొనేందుకు గట్టిగా కృషి చేయకుండా పదవుల కోసం కీచులాడుకొంటున్నారు. గత ఎన్నికల సమయంలో సరిగ్గా ఇదే కారణం చేత పార్టీకి విజయావకాశాలు ఉన్నప్పటికీ తెరాస చేతిలో ఓడిపోయింది. అయినా ఇప్పటికీ ఆ పార్టీ నేతల ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పు రాలేదని ఇది సూచిస్తోంది. కనుక ఏదో ఒకరోజు రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకు పోవచ్చు.