వైకాపాని వీడి బయటకు వెళ్ళిపోయే వారందరూ కామన్ గా చేసే పిర్యాదు ఒకటుంది. అదే “జగన్మోహన్ రెడ్డికి చాలా అహంభావి. ఎవరి మాట వినడు. ఎవరి సలహాలు స్వీకరించడు,” అని. కానీ మొట్టమొదటిసారిగా ఆయన గురించి నాలుగు మంచి ముక్కలు వినబడ్డాయి. ఇవ్వాళ్ళ తెదేపాలో చేరిన సుజయ కృష్ణ రంగారావు మీడియాతో మాట్లాడుతూ “జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా గౌరవంగానే చూసుకొన్నారు. ఆయనతో నేనెన్నడూ ఇబ్బంది పడలేదు. బొత్స సత్యనారాయణ కారణంగా నేను పార్టీ వీడుతున్నాననే ప్రచారం కూడా నిజం కాదు. పార్టీలో వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం చాలా సహజమే. కానీ నేను ఆయనతో విభేదించి పార్టీ మారడం లేదు. జిల్లాలో వెనుకబడి ఉన్న నా నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. పార్టీ కార్యకర్తలు కూడా నాతో ఏకీభవించిన తరువాతే పార్టీ మారుతున్నాను,” అని చెప్పారు.
పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తరువాత కూడా జగన్ పట్ల ఇంత గౌరవంగా మాట్లాడటం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. కానీ జగన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. బుజ్జగింపుల తంతు కూడ ముగిసిన తరువాత ఆయన పార్టీ మారుతారని రూడీ చేసుకోగానే సాక్షి మీడియాలో ఆయన మంత్రి పదవికి ఆశపడి వెళుతున్నారని ప్రచారం చేసింది. ఇవి వారిద్దరి వ్యక్తిత్వాలకి ఉన్న తేడాను పట్టి చూపుతోంది.