తెలుగుదేశం పార్టీ కి తెలంగాణ లో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయితే ఆయన పార్టీ లొనే కొనసాగే విషయం, పార్టీ తో అయన కొనసాగించే అనుబంధం విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అయన తెలుగుదేశం పార్టీ తో తొలినుంచి అనుబంధం ఉన్న వ్యక్తి గా కాకుండా.. చివరి నిమిషంలో పార్టీలో చేరి టికెట్ దక్కించుకోవడం ఒక కారణం అయితే, పార్టీ నుంచి తోలి విడతలోనే ఫిరాయించిన తీగల కృష్ణా రెడ్డి కి అయన స్వయానా వియ్యంకుడు కావడం మరో కారణం. వీటన్నిటినీ మించి ఛాన్స్ దొరికినప్పుడెల్లా అయన తెలంగాణ సీఎం కెసిఆర్ ను కీర్తిస్తున్న వైనం కూడా పార్టీ వారికీ అనేక అనుమానాలు కలిగిస్తూ వచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు ఎంపీ మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ ని విపరీతంగా కీర్తిస్తున్నారు. చంద్రబాబు ను కీర్తించే పనిలో భాగంగా ఏర్పాటు అయిన సమావేశంలో ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ వనవాసం చేస్తున్నదని, 2019 ఎన్నికల తరువాత మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. నిజానికి మల్లారెడ్డి అవసరం ఉన్న సందర్భాలలో తప్ప ఇలా పార్టీ మీద ప్రేమను ప్రకటించిన సందర్భాలు చాలా తక్కువ. అయన ప్రస్తుతం ఇలా పార్టీ విజయం గురించి చెప్పడం అందరికీ అనుమానం కలిగిస్తున్నాడు.
మల్లారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం మరేమయిన ఉన్నదా అని కూడా పలువురు ఆలోచిస్తున్నారు. మల్లారెడ్డి కి చాలాకాలం నుంచి కేంద్ర మంత్రి పదవి మీద మనసుంది. టీడీపీ లో ఉంటె మాత్రమే అది సాధ్యం అవుతుందని కూడా ఆయనకు తెలుసు. తెరాస లోకి వెళ్ళినా తనకు కల తీరదని కూడా తెలుసు. ఎటూ సుజనా చౌదరి పదవి అయిపోతున్నది గనుక.. తెలంగాణ కోటా లో టీడీపీ తనకు ఆ పదవి ఇవ్వాలని అయన కోరిక. గతంలో ఎర్రబెల్లి ద్వారా చంద్రబాబు కు అయన సిఫారసు కూడా చేయించుకున్నారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు మల్లారెడ్డి ని నమ్మి సిఫారసు చేయడానికి ఎర్రబెల్లి కూడా లేరు. మరి మల్లన్న పొగడ్తలను పార్టీ అధినేత విని, ప్రత్యుపకారం చేస్తారా లేదా చూడాలి.