ఒకప్పుడు ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు కత్తులు దూసుకొంటున్నప్పుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ ఓ మాట అంటుండేవారు. “ప్రభుత్వాలుగా సహకరించుకొందాము..పార్టీలని వాటి పనిని అవి చేసుకోనిద్ధాము,” అని. అంటే తెలంగాణా ప్రభుత్వాన్ని తెదేపా నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి సహకరించుకొందామని ఆయన సూచించారన్న మాట. కానీ అదెలాగ సాధ్యమని అందరూ సందేహపడేవారు. అది సాధ్యమేనని కేసీఆర్ నిరూపించి చూపారు…రాష్ట్రంలో నుంచి తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేసి చంద్రబాబు నాయుడుతో స్నేహం కంటిన్యూ చేస్తూ! కనుక చంద్రబాబు నాయుడు కూడా ఆయనని ఈ విషయంలో తప్పు పట్టలేకపోతున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ థంబ్ రూల్ ని బాగా ఆకళింపు చేసుకొన్న వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు. ఆయనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడానికి ఆ పార్టీతో ఉన్న రాజకీయ విభేదాలు అవరోధం కావని తెలియజెపుతూ అవకాశం, అవసరం ఉన్నప్పుడల్లా కేసీఆర్ ని కలిసి షేక్ హ్యాండ్స్ ఇస్తూ, ఫోటోలు దిగుతూ, తన కార్యక్రమాలకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఆ మధ్య గ్రేటర్ ఎన్నికలలో తెదేపా నేతలు తెరాసతో భీకర యుద్ధం చేస్తుంటే, బాలకృష్ణ కూల్ గా వెళ్లి కేసీఆర్ ని కలిసి సినిమా కబుర్లు చెప్పుకొని ఫోటోలు దిగివచ్చేరు. వారి ఫోటోలు, కబుర్లు అన్నీ మర్నాడు మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యేయి కూడా. అది చూసి తెలంగాణా తెదేపా నేతల నోట మాటలేదు. వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారయింది. ఆ తరువాత గ్రేటర్ ఎన్నికలలో తెరాస చేతిలో తెదేపా, భాజపాలు చావు దెబ్బ తినడం, ఆ కారణంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వంటివారు అనేకమంది పార్టీని విడిచి తెరాసలో చేరిపోవడం జరిగింది.
కేసీఆర్ పుణ్యామాని తెలంగాణాలో తెదేపా పూర్తిగా ఖాళీ అయిపోయిందిపుడు. కానీ అదేమీ తమ స్నేహానికి అడ్డుకాబోదని చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇద్దరూ దృడంగా నమ్ముతున్నట్లున్నారు. అందుకే కేసీఆర్ మొన్న “సహకరించుకొందాము రా” అని అనగానే చంద్రబాబు నాయుడు ‘నేను ఎవ్వర్ రెడీ” అని వెంటనే జవాబిచ్చారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతున్న బాలయ్య బాబు బుధవారం సి.ఎం. క్యాంప్ కార్యాలయానికి వెళ్లి తను నటించబోతున్న 100వ చిత్రం ‘గౌతమీ పుత్రా శాతకర్ణి’ సినిమా షూటింగ్ ముహూర్తం షాట్ కి కేసీఆర్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రం అందజేసారు. అందుకు కేసీఆర్ సంతోషంగా అంగీకరించినట్లు సమాచారం. ఈనెల 22న ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది.