రాష్ట్రంలోని పేదలు అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకు రావడానికి తమకు చిత్తశుద్ధి ఉంది అన్నట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పుకుంటున్నది. సంచార చికిత్సాలయాలను ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు సర్కారు ఈ ఉద్దేశాన్ని చాటుకున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేస్తాం అని , కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా తీర్చి దిద్దుతామని, పేదలు అందరికీ కార్పొరేట్ వైద్యం అందిస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. అసలే ఆరోగ్యశ్రీ ముసుగులో ఏటా కొన్ని వందల వేల కోట్ల రూపాయలను ప్రెవేటు ఆస్పత్రులకు ప్రభుత్వాలు దోచిపెడుతున్న ఈ రోజుల్లో సర్కారు ఆస్పత్రులను మెరుగు పరచాలనే ఈ ఆలోచన చాల మంచిది. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధి తో ఈ మాట చెబుతున్నదా లేదా, ఇందులో మరో రకం అధికారిక దోపిడీకి రంగం సిద్ధం అవుతున్నదా అనేది కీలకం.
ఈ సమయంలో జనం మనసులో మెదలుతున్న ఆలోచన మరొకటి ఉంది. అందరికి మంచి ఆరోగ్య, చికిత్స వసతులను కల్పించడం గురించి లోక్ సత్తా సంస్థ అధినేత జయప్రకాష్ నారాయణ ఒక మోడల్ తాయారు చేసారు. దానికి కేంద్రం పరిశీలనకు కూడా పంపారు. నీతి ఆయోగ్ ప్రతినిధులను కలిసి దాని గురించి వివరించబోతున్నారు. జనం పట్ల నిజమైన చిత్తశుద్ధి, నిస్వార్ధ సేవ గురించిన ఆలోచన ఉన్న మేధావి గ జేపీ కి గుర్తింపు ఉంది. ఇప్పుడు జనం కోరుకుంటున్నది కూడా అదే. బాబుకు చిత్తశుద్ధి ఉంటే గనుక జేపీ మోడల్ ను ముందుగ తెలుసుకుని, తొలుత మన రాష్ట్రం లొనే ఇంప్లీమెంట్ చేసే ప్రయత్నం జరగాలి.
జేపీ మన రాష్ట్రానికి ఉన్న సంపద గా మనం భావించాలి. ఎటు అయన తన రాజకీయ పార్టీ ని కూడా రద్దు చేసేసారు గనుక, రాజకీయంగా మైలేజి పోతుందని బాబుకు భయం అక్కర్లేదు. కానీ జనం ఆరోగ్యం విషయంలో చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఆయనను సంప్రదించడం మంచిదని అంతా అనుకుంటున్నారు.