హైదరాబాద్: ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీలు వర్ణవివక్షను ప్రోత్సహిస్తున్నాయని, అవి ఆడవారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నాయని ఇటీవల స్త్రీవాదులు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇలాంటి కంపెనీ ఆఫర్ చేసిన రు.2 కోట్ల యాడ్ కాంట్రాక్ట్‌నొకదానిని తిరస్కరించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నటి అనుష్క శర్మకూడా ఆ జాబితాలో చేరారు. ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వర్ణ వివక్షను ప్రోత్సహిస్తున్నాయని తాను అలాంటి యాడ్‌లు చేయబోనని ఆమె ప్రకటించారు.
కంగనా రనౌత్‌కు ఆ యాడ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేసినపుడు, తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారనుకోవటం మూర్ఖత్వమని, తన సోదరి తనంత తెల్లగా లేకపోయినా అందంగా ఉంటుందంటూ తిరస్కరించారు. గతంలో రణబీర్ కపూర్,ఐశ్వర్యా రాయ్, కూడా ఇలాంటి యాడ్‌ను ఇదే కారణాలతో తిరస్కరించారు. ఇక ఆఫ్‌బీట్ చిత్రాల నటి నందితా దాస్ అయితే ఈ యాడ్‌లకు వ్యతిరేకంగా ఉద్యమమే నడిపారు. అయితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, కరీనా కపూర్, యమీ గౌతమ్ వంటి నటులుమాత్రం ఆ నిరసనలను పట్టించుకోకుండా ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల యాడ్‌లలో నటిస్తూనే ఉన్నారు.