హైదరాబాద్: తెలంగాణ వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖలమంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇవాళ కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానంనాగేందర్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలూ దాదాపు 20నిమిషాలపాటు భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన తలసాని, ఈ భేటీకి ప్రాధాన్యత ఏమీ లేదని, బోనాలకు ఆహ్వానించటానికే వచ్చానని అన్నారు.
అయితే ఈ భేటీపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దానం నాగందర్ టీఆర్ఎస్లో చేరతారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అయితే దానం ఇటీవల ఆ వార్తలను తిరస్కరించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. టీఆర్ఎస్కు గ్రేటర్ హైదరాబాద్లో విజయావకాశాలు తక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎమ్ఐఎమ్ పార్టీతో పొత్తు అయినా ఉపయోగపడుతుందనుకుని వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తే, తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీచేస్తామని అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ప్రకటించటంతో ఆ ప్రయత్నమూ విఫలమయింది. ఇలాంటి పరిస్థితులలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్కు ఒక పెద్ద దిక్కు అవసరం స్పష్టంగా కనబడుతోంది. నగరంలో ఎంతో పట్టున్న దానం నాగేందర్ కనుక పార్టీలో చేరితే గ్రేటర్లో విజయావకాశాలు మెరుగుపరుచుకోవచ్చని టీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే తలసానితో దానందగ్గరకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి టీడీపీలో ఉన్న తలసాని బోనాలుకు కేసీఆర్ను ఆహ్వానించటం, దరిమిలా టీఆర్ఎస్లో చేరటం తెలిసిందే.