కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై మరో 11 కేసులు హైదరాబాద్ లో కూడా నమోదు అయ్యేయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వాడుకొన్నందుకుగాను ఆ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జి.ఎం.ఆర్.సంస్థకి గతంలో విజయ్ మాల్యా రూ.8 కోట్లకి కొన్ని చెక్కులు ఇచ్చేరు కానీ ఆయన బ్యాంకు ఖాతాలో అందుకు తగినంత డబ్బు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యేయి. ఆ డబ్బు చెల్లించాల్సిందిగా ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ విజయ్ మాల్యా పట్టించుకోకపోవడంతో జి.ఎం.ఆర్.సంస్థ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టులో మొత్తం 11 కేసులు వేసింది. ఆ కేసులపై బుధవారం విచారణ చేసిన న్యాయస్థానం విజయ్ మాల్యా ఉద్దేశ్యపూర్వకంగానే జి.ఎం.ఆర్.సంస్థని మోసం చేసినట్లు నిర్ధారణ చేసింది. ఆ కేసులపై విచారణను మే5కి వాయిదా వేసింది. అదే రోజున తీర్పును ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ‘తలుపులు నమిలి తినేసేవాడికి అప్పడాలు నమలడం ఒక లెక్కా’ అన్నట్లుగా ఏకంగా 17 బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకి ఇటువంటి చిన్న చిన్న కేసులకు భయపడతాడా? సుప్రీం కోర్టు ఆదేశాలనే ఖాతరు చేయనివాడు ఎర్రమంజిల్ కోర్టుని చూసి భయపడతాడా? విజయ్ మాల్యాపై ఇటువంటివి ఇంకా ఎన్ని కేసులున్నాయో తెలియదు కానీ వాటిలో ఇదీ ఒకటి కనుక కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా ఆయనకేమి అభ్యంతరం ఉండకపోవచ్చు.