పార్టీలో ఉన్నంత కాలం అందరూ మంచివాళ్ళే..కానీ పార్టీ మారగానే దుర్మార్గులయిపోతారు. అంతవరకు ఒకరి భాగోతాలు మరొకరికి తెలిసినా నోరు విప్పనివారు పార్టీ మారగానే ఆ భాగోతాలన్నీ బయటపెట్టుకొంటారు. ఇవన్నీ నేటి రాజకీయాలలో సర్వసాధారణమయిపోయాయి. వైకాపా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు పార్టీని వీడి తెదేపాలో చేరగానే ఆయనపై కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులుకక్కారు. ఆ సందర్భంగా ఆమె చరిత్ర పాఠాలు కూడా త్రవ్వి తీశారు.
“పౌరుషానికి, నీతి నిజాయితీకి ప్రతీకలమని చెప్పుకొనే బొబ్బిలి రాజులు 100-150 ఎకరాల తమ భూమిని క్రమబద్దీకరించుకొనేందుకు తెదేపాలో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బొబ్బిలి ప్రజలు వైకాపాలో ఉండమని ఎన్నుకొంటే ఆయన వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా తెదేపాలో చేరారు. పార్టీ మారాలనుకొంటే వైకాపా ద్వారా దక్కిన తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది. తమ విరోదులయిన గజపతులతో చేతులు కలిపి తాండ్ర పాపారాయుడు పౌరుషానికి మచ్చ తెచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకి ఏమాత్రం ఉపయోగపడని అశోక్ గజపతి రాజు ఒక దళారిలా, బుస్సీ దొర పక్కన చేరినట్లుగా వ్యవహరిస్తే, సుజయ కృష్ణ రంగారావు నిసిగ్గుగా ఆయనతో చేతులు కలిపి తెదేపాలో చేరిపోయారు. ఆయనకి రాజవంశీకులమనే పౌరుషం, నైతిక విలువలు ఉన్నాయనుకొంటే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి,” అని వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేసారు.
ఆమె వాదన, ఆవేదన రెండూ సహేతుకమే కానీ అందుకు ఆమె ఉపయోగిస్తున్న బాష, స్థాయే అభ్యంతరకరంగా ఉన్నాయి. సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారారు కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరితే సరిపోయేదానికి ఆమె చరిత్ర త్రవ్వి బుస్సీ దొరవరకు వెళ్ళిపోవడం సరికాదు.
పార్టీని వీడి బయటకి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల గురించి ఆమె లేదా వైకాపా నేతలు మాట్లాడుతున్న తీరు ఆ పార్టీలో కొనసాగాలనుకొంటున్న ఎమ్మెల్యేలను కూడా బయటకు వెళ్లిపొమ్మని ప్రేరేపిస్తున్నట్లుంది. ఇటువంటి విమర్శలు తమ గురించి పార్టీ అధిష్టానానికి ఇంత నీచమయిన అభిప్రాయం ఉందని, ఒకవేళ తాము పార్టీని వీడినా తమ గురించి కూడా ఇలాగే చులకనగా మాట్లాడుతారని వారు గ్రహించేలా చేస్తున్నాయి. పార్టీ వీడినవారిని విమర్శించే ప్రయత్నంలో పార్టీలో ఉన్నవారికి కూడా పొగపెడుతున్నట్లుందని వైకాపా అధిష్టానం గ్రహించడం లేదు. ఇప్పటికే డజను మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోయినపుడల్లా వారి భాగోతాలు బయటపెడుతూ తమ పార్టీలో ప్రతీ ఎమ్మెల్యేకి ఏదో ఒక తెర వెనుక భాగోతం ఉందని చాటి చెప్పుకొంటున్నట్లుంది. పార్టీని వీడిపోయిన వారి పట్ల ఆగ్రహం కలగడం సహజమే కానీ అది అదుపు తప్పితే ఏమవుతుందో ఇది తెలియజేస్తోంది. పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినా వారి గురించి బాధపడటం కంటే, పార్టీలో ఉన్నవారి మాటకు విలువిచ్చి వారిని కాపాడుకొంటే మంచిదేమో వైకాపా ఆలోచిస్తే బాగుంటుంది.