సక్సెస్ హేస్ మెనీ ఫాదర్స్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. ఒక పని విజయవంతం అయితే దానికి సంబంధించి ఘనత నాదంటే నాదని టముకు వేసుకోవడానికి చాలామంది మొనగాళ్ళు ముందుకు వస్తారు. అయితే అదే పని విఫలం అయిందంటే మాత్రం… మాకేమీ సంబంధం లేదంటూ ఎవరికీ వారు బాధ్యత నుంచి జారుకోవడానికి చూస్తుంటారు. ఇది లోకరీతి. అయితే కనీసం కొంత మంది పెద్ద మనుషుల విషయంలో అయినా ఇలాంటి వక్ర పోకడలు ఉండవు అని మనం ఆశిస్తుంటాం. వారు కూడా అలాగే వ్యవహరిస్తే ఇక ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది. ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వైఖరి కూడా అలాగే కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రం విడిపోయిన తరవాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రకాల ఇబ్బందుల మధ్య ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఎదురు కాగల విద్యుత్తు సమస్యను చంద్రబాబు మొదటి ప్రాధాన్యం గా తీసుకున్నారు. ఆ సమస్యను పూర్తీ స్థాయిలో సెట్ చేసారు. ఏపీ మొత్తం గృహ వినియోగంలో పవర్ కట్ లు లేని పరిస్థితిని తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. మరి కొన్నాళ్ళకు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థితికి ఏపీ వస్తుందని చాల ఘనంగా ప్రకటించారు.
అయితే ఇప్పుడు ఏపీ లో బీజేపీ ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏపీ లో అద్భుతంగా ఉన్న విజయాలు అన్నీ తమ చలవతోనే, కేంద్రం నిధులతోనే జరిగాయని టముకు వేసే ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీ ని మోసం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించి ఉన్న సమయంలో మేము చేసినది చాలా ఉంది అని చాటి చెప్పడం చేస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు కుడా అదే పని చేస్తున్నారు. విద్యుత్ విషయంలో ఏపీ సమృద్ధిగా ఉన్నది గనుక.. ఆ క్రెడిట్ ను తను క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రం పుణ్యం తోనే ఏపీ లో నిరంతర విద్యుత్ ఉందని అంటున్నారు.
ఏపీ మీద వెంకయ్య గారికి అంతగా ప్రేమ ఒలికి పోవడమే గనుక నిజమైతే ప్రత్యెక హోదా విషయంలో అయన తీసుకుంటున్న శ్రద్ధ ఏమిటో, చేస్తున్న కృషి ఏమిటో వివరించాలి. అంతే తప్ప తొలుత చెప్పుకున్న సామెత తరహాలో మాట్లాడడం అంత పెద్ద వారికి కరెక్టు కాదని పలు విమర్శలు విన్పిస్తున్నాయి.