అక్కడ ఎన్నికలు జరిగి సుమారు ఆరేళ్లు అవుతోంది. అయిదేళ్లు అయిదేళ్లు పక్కాగా పూర్తయ్యాయి. అయితే సదరు ఎన్నికకు సంబంధించిన వివాదానికి సంబంధించిన తీర్పు మాత్రం ఇప్పుడే వచ్చింది. ఆ ఎన్నికల వివాదాన్ని తేల్చడం వలన దక్కే పదవీకాలం కూడా ముగిసిపోవడానికి దగ్గర పడుతున్న తరుణంలో.. ఇప్పుడు తీర్పు రావడం ఒక తమాషా. అయితే.. కోర్టు తీర్పు ప్రకారం.. ఆ ఎన్నికలో ఓడిపోయినట్లుగా తేలిన వ్యక్తి.. చాలా కాలం కిందటే.. ఆ పదవికి రాజీనామా చేసి వదిలేసుకుని ఉండడం మరొక విచిత్రం. తమాషాగా, గందరగోళంగా కనిపిస్తున్న ఈ వ్యవహారం మొత్తం చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలో 2011 లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నరేశ్‌కుమార్‌రెడ్డి పోటీచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా దేశాయి తిప్పారెడ్డి బరిలోకి దిగారు. ఆ ఎన్నికలో తిప్పారెడ్డి గెలిచినట్లుగా ప్రకటించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ.. ఓడిపోయిన నరేశ్‌కుమార్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు కోర్టులో ఉన్న సమయంలోనే దేశాయి తిప్పారెడ్డి తాను గెలిచిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేశారు. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున మదనపల్లె నుంచి బరిలోకి దిగి, ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరునుంచి గెలిచిన ఎమ్మెల్సీ ఎవరన్న విషయం మాత్రం తేలకుండా.. కోర్టులోనే ఉండిపోయింది. విచారణలో భాగంగా హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించినప్పుడు.. నరేశ్‌కుమార్ రెడ్డికి ఒక ఓటు కలిసి, ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానం అయ్యాయి. దీంతో నిబంధనల ప్రకారం.. న్యాయవాదుల సమక్షంలో లాటరీ తీయడంతో.. నరేశ్‌కుమార్ రెడ్డి పేరు వచ్చింది. ఇప్పటికే రాజీనామా చేసి, పదవిని వదిలేసుకుని ఉన్న తిప్పారెడ్డి ఎన్నికను రద్దుచేసి, నరేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. అయితే ఆయన ఓ ఏడాదికి మించి, ఈ పదవిలో ఉండకపోవచ్చు.