నందమూరి బాలకృష్ణ ఈనెల 24న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రాబోతున్నారు. అనంతరం స్థానిక బస్టాండ్ జంక్షన్ వద్ద ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత స్థానిక నటరాజ్ థియేటర్లో ఆయన నటించిన డిక్టేటర్ సినిమా శత దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు. క్లుప్తంగా ఇదీ ఆయన జిల్లా పర్యటన వివరాలు. చీపురుపల్లి నియోజకవర్గం వైకాపా నేత బొత్స సత్యనారాయణకి కంచుకోట వంటిది. అక్కడ స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బాలకృష్ణ పర్యటన, బహిరంగ సభ నిర్వహించడం వైకాపాకి సవాలు విసురుతున్నట్లుగానే చూడవచ్చు. బాలకృష్ణ చీపురుపల్లి పర్యటనలో వైకాపాకి చెందినవారెవరూ తెదేపాలో చేరకపోయినా, కొత్తగా పార్టీలో చేరిన సుజయ కృష్ణ రంగారావు వచ్చి ఆయనతో కలిసి ఆ కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే తప్పకుండా చాలా ప్రభావం కనబడుతుంది. ఒకవేళ ఆయన రాకపోయినా జిల్లాలో తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ రావడం తధ్యం కనుక దీనిపై బొత్స సత్యనారాయణ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.