తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరిని ఒకరు పలు సందర్భాల్లో ఆదర్శంగా తీసుకుంటూ.. ప్రజాసంక్షేమ పథకాల విషయంలో నిర్ణయాలను పంచుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని సందర్భాల్లో పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్న నిర్ణయాలను కూడా కాపీ కొట్టి అయినా సరే.. తమ తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి వీరు వెనుకాడ్డం లేదు. అలాంటి నేపథ్యంలో తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకూ అనుసరణీయం కావచ్చుననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. తాజాగా ప్రభుత్వ పరంగా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆయా వర్గాలను బాగా ఆకట్టుకునే నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
జనాకర్షక పథకాలను, కులాల పరంగా ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే పథకాలను ప్రకటించే విషయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వమూ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కేసీఆర్ బీసీలు, మైనారిటీలకు ప్రత్యేక పథకాలు ప్రకటించినా, చంద్రబాబు కాపుల్ని బీసీల్లో చేరుస్తా అన్నా.. అన్నీ ఈ కోవలోకే వస్తాయి. అదే క్రమంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ప్రభుత్వం కేటాయించే కాంట్రాక్టు పనుల్లో ఆ వర్గాల వారికి రిజర్వేషన్ సదుపాయం కల్పించడం, పైగా టెండరు పద్ధతి లేకుండా పనులను చేపట్టేలా వారికి వెసులుబాటు కల్పించడం అనేది.. ఎస్సీ ఎస్టీలను ప్రభుత్వానికి అనుకూలంగా విపరీతంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.
ఎక్కువ మంది ఒకే పనికి దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా కేటాయించడం అనేది చాలా పారదర్శకంగా ఎస్సీలకు మేలుచేసే ఆలోచన. సిద్దూ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ వర్గాలు బ్రహ్మరథం పడతాయని ఆశించవచ్చు. ఇలాంటి పథకాన్ని ఇపుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే.. ఇక్కడ రెండు ప్రభుత్వాలూ వైఖరి వేరే గనుక.. ఈ పథకం ద్వారా తమ పార్టీకి చెందిన వారికే ఎక్కువ లబ్ధి ఒనగూరేలాగా.. సిద్ధరామయ్య ప్రభుత్వ రిజర్వేషన్ల ఆలోచనలో కొన్ని చిన్న చిన్న మార్పులతో ఇక్కడ అమల్లోకి తేవచ్చునని పలువురు భావిస్తున్నారు.