పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం సానుభూతి ఓట్లనే నమ్ముకుంటున్నది. మరణించిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి వారసులుగా బరిలోకి దిగడానికి ఆయన కుటుంబం తొలుత విముఖత ప్రదర్శించినప్పటికీ, విపరీతమైన మీమాంసకు గురైనప్పటికీ.. పార్టీ బాధ్యత మొత్తం తాము తీసుకుంటాం అనే భరరోసా వారికి అందిస్తూ.. వెంకటరెడ్డి భార్య సుచరితను అభ్యర్థిగా దించడానికి ప్రతిపాదిస్తూ అధిష్టానానికి నివేదిక పంపింది.
నారాయణఖేడ్ విషయంలో కాంగ్రెస్ సానుభూతితో ఏకగ్రీవంగా ఆ సీటు సొంతం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు కనీసం పాలేరులోనైనా అదే సానుభూతి కోటాలో.. అర్థంతరంగా మరణించినందున పోటీ లేకుండా ఈ సీటును దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. పోటీకి దిగవద్దంటూ ఇతర పార్టీలతో మాట్లాడి, అదే విజ్ఞప్తి కోసం కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నది. అయితే కేసీఆర్ వారికసరి కనీసం అపాయింట్మెంట్కూడా ఇవ్వకుండానే… నేరుగా తమ అభ్యర్థిని ప్రకటించేసి, ఈ ఎన్నికల విషయాన్ని మలి అంచెలోకి తీసుకువెళ్లిపోయారు.
తెరాస అభ్యర్థిని తేల్చిన వెంటనే తెదేపా కూడా యాక్టివేట్ అయింది. తమ అభ్యర్థి విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ రెండు పార్టీలు తేల్చిన తర్వాత.. ఇక ఏకగ్రీవం అనే ఆశ గల్లంతే గనుక.. కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపికను కొలిక్కి తెచ్చింది. నిజానికి వెంకటరెడ్డి స్థానంలో బరిలోకి దిగడం వారి కుటుంబంలో పెద్దగా ఇష్టం లేకపోయినప్పటికీ… పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుందనే భరోసా ఇచ్చి మరీ… వెంకటరెడ్డి భార్య సుచరిత పేరును అధిష్ఠానానికి పంపింది. వారికి అభ్యర్థిత్వం కోసం వేేరే పోటీ కూడా లేదు గనుక.. ఇవాళ సాయంత్రానికి ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు. వామపక్షాల వారు కూడా పోతిరెడ్డి సుదర్శన్ పేరును ప్రకటించారు. ఇక వైకాపా ఏ సంగతి తేలిస్తే.. పాలేరులో చతుర్ముఖ పోటీనా, పంచముఖ పోటీనా అనేది నిర్ధరణ అవుతుంది.