ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుని తెరాస అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నందున మంత్రిగా కొనసాగేందుకు ఎటువంటిఇబ్బందులు లేవు. కానీ పార్టీలో టికెట్ కోసం చాలా మంది పోటీపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి స్వయంగా ఆయనను పోటీ చేయమని కోరడంతో అంగీకరించవలసి వచ్చింది.
ఖమ్మం జిల్లాలో ఆయనకి మంచి పట్టు, పలుకుబడి ఉంది. పైగా అధికార పార్టీకి చెందినవారు, ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపాదించిన వ్యక్తి కనుక పార్టీ తరపు నుంచి కూడా ఆయనకు పూర్తి మద్దతు లభిస్తుంది. కనుక ఈ ఉపఎన్నికలలలో ఆయన అవలీలగా విజయం సాధించగలరు. అటువంటప్పుడు ఆయన నిస్సంకోచంగా తన మంత్రి, ఎమ్మెల్సీ పదవుల రెంటికీ రాజీనామా చేసి పోటీ చేయవచ్చును. అదే గౌరవం, సాంప్రదాయం కూడా. కానీ ఆయన తన పదవులకు రాజీనామా చేయకుండా పోటీ చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. విజయావకాశాలు అంత స్పష్టంగా ఉన్నా కూడా ఆయన తన పదవులకు రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడటం చాలా విచిత్రంగానే ఉంది. దాని వలన ఆయనకు ఈ ఎన్నికలలో గెలుస్తాననే నమ్మకం ఆత్మవిశ్వాసం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించినట్లవుతుంది. దీనికి కేసీఆర్ అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ అంగీకరిస్తే ఇది మరొక దుస్సంప్రదాయంగా మారుతుంది.