ఉత్తరాఖండ్ హైకోర్టులో కేంద్రప్రభుత్వానికి ఈరోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో విదించిన రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తునట్లు ప్రకటించింది. అంతకు ముందున్న పరిస్థితిని ‘స్టేటస్ కో’ను పాటించాలని హైకోర్టు ఆదేశించింది. హరీష్ రావత్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేప్పట్టవచ్చని స్పష్టం చేసింది. ఆయనకు ఈనెల 29న శాసనసభలో మెజార్టీ నిరూపించుకొనేందుకు అవకాశం కూడా కల్పించింది. హరీష్ రావత్ తన ప్రభుత్వానికి శాసనసభలో మెజారిటీ ఉందని నిరూపించుకొనేందుకు ఆయనకు మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం కల్పించడం చాలా అవసరమని చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసఫ్, జస్టిస్ వి.కె.బిస్త్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు గట్టిగా సమర్ధించింది. వాళ్ళు ‘రాజ్యాంగపరమయిన పాపం’ చేసినందుకు వారికి ఆ శిక్ష తగినదేనని చెప్పింది. అంతేకాదు కేంద్రప్రభుత్వం ఏదో ఒక సాకు చూపించి ఆర్టికల్ 356 ద్వారా తనకున్న విశేషాదికారాలతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విదించడం చాలా పొరపాటని అభిప్రాయం వ్యక్తం చేసింది.
విశేషమేమిటంటే కేంద్రప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మళ్ళీ హైకోర్టునే స్టే మంజూరు చేయాలని కోరడం! అందుకు హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మేమిచ్చిన తీర్పుపై మేమే స్టే ఇవ్వలేము. మీరు కావాలనుకొంటే సుప్రీం కోర్టుకి వెళ్లి మా తీర్పుపై స్టే తెచ్చుకోవచ్చు,” అని స్పష్టం చేసింది.
హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు, అడ్డుదారిలో అధికారం చేజిక్కించుకొందామని ప్రయత్నించిన మోడీ ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం హైకోర్టులో ఇంత అవమానకర పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది కనుక, దాని తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేసి స్టే కోరవచ్చు. కానీ అక్కడ కూడా మళ్ళీ ఎదురుదెబ్బ తగిలితే ఇంతకంటే అవమానకరంగా ఉంటుంది. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ కేంద్రప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే అంతకంటే అప్రదిష్ట మరొకటి ఉండదు.