వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజాని తెదేపా ప్రభుత్వం శాసనసభ నుంచి ఏడాది కాలం పాటు సస్పెండ్ చేయగా ఆమె దానిని సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఆమె కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణకు చేపట్టింది.
ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత శాసనసభ వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ విషయంలో స్పీకర్ దే అంతిమ నిర్ణయం అవుతుందని స్పష్టంగా పేర్కొంది. కొత్తగా ఎమ్మెల్యే అయిన రోజా తెలిసితెలియక శాసనసభలో తప్పుగా వ్యవహరించి ఉండవచ్చు కనుక క్షమాపణ కోరుతూ స్పీకర్ కి లేఖ వ్రాయాలని సూచించింది. ఈ వ్యవహారంలో ఇరు పక్షాలు పట్టువిడుపులు ప్రదర్శించి సమస్యను పరిష్కరించుకోవడం మంచిదని ధర్మాసనం పేర్కొంది. శాసనసభ అంటే కొందరు వ్యక్తులు సమావేశమయ్యే వేదిక కాదని, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులకు వేదికని అందరూ గుర్తుంచుకొని తదనుగుణంగా హుందాగా మెలగాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై ఇరుపక్షాలకు చెందిన న్యాయవాదులు మాట్లాడుకొని తమ అభిప్రాయం తెలియజేయామని కోరింది. ఒకవేళ ఇప్పటికీ రోజా తన వాదనకే కట్టుబడి ఉండాలనుకొంటే ఆ విషయం తెలియజేస్తే, రేపు తీర్పు చెపుతామని ఈ కేసును రేపటికి వాయిదా వేసింది.
సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన తరువాత రోజా ఒక మెట్టుదిగి ఈ వివాదం ఇంతటితో ముగిద్దామని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ వ్యవహారంలో సంజాయిషీ చెప్పుకొనేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆమె మీడియా ద్వారా స్పీకర్ కోడెలకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అయితే ఆమె బేషరతుగా క్షమాపణలు చెపితే తప్ప ఆమెపై సస్పెన్షన్ రద్దు చేసే ఆలోచన లేదని తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు జవాబిచ్చినట్లు సమాచారం.
హైకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు రోజా ఎంత హడావుడి చేసారో అందరూ చూశారు. ఒకవేళ సుప్రీం కోర్టులో కూడా అనుకూలంగా తీర్పు వచ్చి ఉండి ఉంటే ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై చెలరేగిపోయుండేవారు. కానీ సుప్రీం కోర్టు చివాట్లు పెట్టడంతో ఒక మెట్టు దిగక తప్పలేదు. గోటితో పోయే ఈ సమస్యను గొడ్డలి వరకు ఆమె తెచ్చుకొన్నారు. బహుశః జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఆమె పరిస్థితి ఇంతవరకు తెచ్చుకొంది. తీరా సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా మళ్ళీ అది కూడా స్పీకర్ ని క్షమాపణలు కోరడం మంచిదని సూచించింది. అదేపని మొదటే చేసి ఉంటే ఈ కధ ఇంత వరకు వచ్చి ఉండేదే కాదు కదా. ఈవిషయంలో తెదేపా కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించిందనే చెప్పవచ్చు. ఆమెకు శాసనసభలో సంజాయిషీ చెప్పుకొనే అవకాశం ఇచ్చి, అప్పటికీ సంతృప్తి చెందకపోతే, శాసనసభ హక్కుల కమిటీకి నివేదించి, దాని సిఫార్సుల మేరకు ఆమెపై చర్యలు తీసుకొని ఉండి ఉంటే, ఇన్ని విమర్శలు, ఇంత న్యాయపోరాటం ఎదుర్కోవలసి వచ్చేదే కాదు. శాసనసభలో రోజా అనుచిత ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, అపరిపక్వ రాజకీయ వ్యూహాలు కూడా దీనికి మరో కారణంగా చెప్పక తప్పదు. కనుక సుప్రీం కోర్టు సూచించినట్లుగా క్షమాపణలు చెప్పుకొని ఇప్పటికయినా దీనికి ముగింపు పలకడం మంచిది.