తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల్లో, శ్రేణుల్లో ఇప్పుడు కొత్త ఆందోళన తలెత్తుతున్నది. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే! అందు చేతనే ఆయన ఫార్మ్ హౌస్కు పరిమితం అయి.. కొన్నిరోజులు గడిపారు. అచ్చంగా.. పాలేరు అభ్యర్థిని ప్రకటించాల్సిన రోజు మాత్రమే స్వయంగా నగరంలోకి వచ్చారు. అనారోగ్యం ఆయనను అంతగా ఇబ్బంది పెడుతున్న సంగతి స్పష్టమవుతూనే ఉన్నది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేసీఆర్కు అమెరికా గవర్నర్నుంచి ఆహ్వానం రావడం అనేది కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తున్నది. ఒక రకంగా కేసీఆర్కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది గౌరవమే అయినప్పటికీ.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎక్కువ రోజులు సాగే అమెరికా యాత్ర గురించి అంతా భయపడుతున్నారు.
కేసీఆర్ సుమారు ఏడాది కిందటే అమెరికా వెళ్లడానికి వీసా తీసుకున్నారు. వీసా స్టాంపింగ్ గురించి ఆయన అమెరికన్ ఎంబసీకి వచ్చి వెళ్లినప్పుడు.. చాలా రకాల పుకార్లు వచ్చాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని, అత్యుత్తమ చికిత్సలు చేయించుకోవడానికే అమెరికాకు వెళుతున్నారని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. కేసీఆర్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు.
ఆయన పూర్ణారోగ్యంతోనే ఇన్నాళ్లూ వ్యవహారాలు నడిపించారు. ఈ మధ్య మాత్రమే ఆయన అనారోగ్యంగా ఉన్నట్లు మళ్లీ వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అమెరికా గవర్నర్నుంచి ఆహ్వానం రావడం యాదృచ్ఛికం కావచ్చు.
కేసీఆర్కు కాలిఫోర్నియా గవర్నర్నుంచి ఆహ్వానం అందింది. శాన్ఫ్రాన్సిస్కోలో జూన్లో జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నిటి గురించి విపులమైన ప్రసంగం చేసేందుకు కేసీఆర్ను స్వయంగా అక్కడి గవర్నర్ ఆహ్వానించారు. అయితే అదే అమెరికా యాత్ర సందర్భంగా కేసీఆర్ వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు కూడా చేయించుకునే అవకాశం ఉన్నదని ఒక ప్రచారం నడుస్తున్నది. సదస్సు కోసం అవసరమైన దానికంటె కాసిని ఎక్కువ రోజులే.. కేసీఆర్ అమెరికా పర్యటన ఉంటుందని ఇప్పటినుంచే ఒక ప్రచారం షురూ అయింది.