బడా కోటీశ్వరులకు వేల కోట్ల రుణాలు సంతర్పణ చేయడం భారతీయ బ్యాంకులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వాళ్లలో చాలా మంది అప్పులు ఎగ్గొట్టడంలో దిట్టలని ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. అయినా బ్యాంకర్లకు బుద్ధి రావడం లేదు. ఇప్పుడు విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాలు తిరిగొస్తాయనే గ్యారంటీ లేకుండా పోయింది. అయినా, ఆ క్రిమినల్ తలెగరేస్తూనే ఉన్నాడు. సమన్లను స్పందించడం లేదు. ఈడీ మూడుసార్లు సమన్లు పంపినా వృథా ప్రయాసే అయింది. ఇప్పుడు తన ఆస్తుల వివరాలు అడిగే హక్కు బ్యాంకర్లకు లేదని దబాయిస్తున్నాడు. తాను మాత్రం 9 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగ్గొట్టే హక్కుందా?
స్టేట్ బ్యాంక్ ఇండియా సహా అనేక బ్యాంకులకు మాల్యా నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఇంగితం చాలా కాలంగా లేకుండా పోయింది. అసలు మీ సంగతేంటని సీబీఐ చీఫ్ బ్యాంకర్లను కడిగిపారేసిన తర్వాత స్టేట్ బ్యాంకు వారిలో చలనం వచ్చింది. అప్పుడు తాపీగా సుప్రీం కోర్టులో బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి. మాల్యా పాస్ పోర్టును రద్దు చేయాలని, విదేశాలకు వెళ్లకుండా ఆదేశించాలని కోరాయి. ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించే సమయానికి మాల్యా లండన్ లో ఉన్నాడు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు దేశ విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను తెలపాలని, అలాగే ఎప్పుడు విచారణకు వస్తాడో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు మాల్యా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రవాస భారతీయుడినైన తనకు విదేశాల్లో ఉన్న స్థిర, చరాస్తుల వివరాలు అడిగే అధికారం బ్యాంకులకు లేదని అందులో దబాయించాడు. రూ. 1591 కోట్లు డిపాజిట్ చేసి చిత్తశుద్ధిని చాటుకుంటానన్నాడు. కానీ విచారణకు ఎప్పుడొస్తాడో చెప్పలేదు.
భారత్ లో తన మీద అనవసరంగా రకరకాల కేసులు పెట్టారని మాల్యా ఆరోపిస్తున్నాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో తీసుకున్న రుణంలో చాలా వరకు డబ్బును విదేశాలకు అక్రమంగా తలరించాడనేది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగం. అందుకే అతడిపై కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని మూడు సార్లు సమన్లు పంపినా రాకపోవడంతో పాస్ పోర్టును తాత్కాలికంగా రద్దు చేయించింది. అతడి అరెస్టుకు వారెంట్ కూడా కోర్టు ద్వారా పొందింది. అయితే అతడిని లండన్ నుంచి రప్పించడం సాధ్యమా అనేదే చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాదులో చెక్కు బౌన్స్ కేసులో మాల్యా దోషేనని కోర్టు తీర్పు చెప్పింది. అంతకుముందు కూడా అతడిమీద అనేక ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సొమ్మును ఆదాయ పన్ను శాఖకు కట్టకుండా సొంతానికి వాడుకున్నాడనే ఆరోపణ ఉంది. జల్సాలకు విలాసాలకు డబ్బు తగలేస్తాడని అందరికీ తెలుసు. అయినా బ్యాంకులు కోట్లాది రూపాయల రుణాలు ఎలా ఇచ్చాయనేదే ఆశ్చర్యకరం.
దీనికి అసలు కారణం అసలు మతలబు వేరే ఉందని పబ్లిక్ టాక్. మాల్యా ఇక్కడే ఉన్నప్పుడు ముందే స్పందించి పాస్ పోర్టును ఎందుకు రద్దు చేయించలేదంటే జవాబు చెప్పరు. అన్ని వేల కోట్లు సరైన గ్యారంటీ లేకుండా ఎలా ఇచ్చారన్నా బదులివ్వరు. ఇంతకీ అసలు సంగతి ఏమిటనేది బ్యాంకర్లు మాత్రం చెప్తారా!