మంత్రులు, ముఖ్యమంత్రులు వేర్వేరు మతాల పండుగల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమయిన విషయమే. అదే ఎన్నికల సమయం అయితే ఆ వర్గం ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆ వర్గానికి చెందిన వారికి నజరానాలు ప్రకటించడం, ఒక్కోసారి వారి పద్దతుల ప్రకారం వారితో కలిసి ప్రార్ధనలు చేయడంవంటివన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఒక హిందూ మతస్తుడయిన మంత్రో, ముఖ్యమంత్రో నమాజ్ చేసే విధానం అసలు తెలియకపోయినా వారిలాగే బట్టలు ధరించి నమాజ్ చేస్తున్నట్లు నటిస్తున్నప్పుడు, చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదో ఒక మతాన్ని అవలంభించనప్పుడు, దాని పద్దతులను పాటించకపొతే ఎవరూ ఏమీ అనుకోరు కానీ పాటిస్తున్నట్లు నటిస్తేనే అది తమను మభ్యపెట్టడానికేనని ఆ మతస్తులు అనుకొంటారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు మూడేళ్ళ క్రితం పాదయాత్ర చేసినప్పుడు వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక వేషాలు ధరిస్తూ, వారికి సంబంధించిన పనులను చేస్తున్నట్లు ఫోటోలు దిగారు. అవి చూసి ప్రజలు నవ్వుకొంటారని బహుశః ఆయనకీ తెలిసే ఉంటుంది కానీ ప్రజలను ఆకట్టుకోవాలంటే అటువంటి వేషాలన్నీ తప్పవనే ఒక అపోహ మన రాజకీయ నాయకులలో దృడంగా నెలకొని ఉండటం వలననే వారు ఆవిధంగా చేస్తున్నారని భావించవచ్చు.
ఈ నియమం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఆయన క్రీస్టియన్ మతస్తుడు. కానీ హిందువులను ఆకట్టుకోవడానికి అప్పుడప్పుడు గుళ్ళు, గోపురాలను, సాధువులను సందర్శిస్తుంటారు. దేవుళ్ళకు అభిషేకాలు వగైరా చేస్తుంటారు. అలాగే పుష్కరాలు వచ్చినప్పుడు హిందూ మతాచారాల ప్రకారం తన తండ్రికి శ్రాద్ధ కర్మలు చేస్తారు. మంత్రులయినా, జగన్ అయినా తమ మతానికి చెందని ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఆ వర్గం ప్రజలకు దగ్గరవవచ్చని అనుకొంటారు కానీ భక్తి, నమ్మకం, చిత్తశుద్ధి లేకుండా వారు చేసే ఆ పనులను చూసి ఆ వర్గానికి చెందిన ప్రజలు తమను, తమ మతాన్ని వారు అపహాస్యం చేస్తున్నారని భావించే అవకాశాలే ఎక్కువ. కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండరాముడి రధోత్సవంలో నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. క్రీస్టియన్ మతస్తుడయిన జగన్ ఇటువంటి హిందూ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించే బదులు, ఇటువంటి సందర్భాలలో మీడియా ద్వారా ఆ వర్గం ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తే సరిపోయేది కదా?