హైదరాబాద్: లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయులూ క్షేమంగా ఉన్నారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని ఇప్పటికే విడుదల చేయగా, మిగిలిన ఇద్దరు తెలుగువారుకూడా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. తెలుగువారిలో ఒకరైన బలరామ్ హైదరాబాద్లోని తన భార్యకు, తాను క్షేమంగా ఉన్నట్లు ఎస్ఎమ్ఎస్ పంపారు. తీవ్రవాదులు నిన్న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేశారు. వీరిలో ఇద్దరు తెలుగువారుకూడా ఉన్నారు. గోపీకృష్ణ, బలరామ్ అనే ఈ ఇద్దరూ లిబియా రాజధాని ట్రిపోలికి సమీపంలోని సిర్ట్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. వీరిలో గోపీకృష్ణ శ్రీకాకుళంజిల్లాకు చెందినవారుకాగా, వీరి కుటుంబంమాత్రం ప్రస్తుతం హైదరాబాద్లోనే నివశిస్తోంది. బలరామ్ తెలంగాణకు చెందినవారు. ఇక మిగిలిన ఇద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన లక్ష్మీకాంత్, విజయకుమార్గా తెలిసింది.