కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తన న్యాయవాది ద్వారా నిన్న సుప్రీం కోర్టుకి ఒక అఫిడవిట్ సమర్పించారు. ప్రవాస భారతీయుడనయిన తనకు విదేశాలలో ఉన్న ఆస్తుల వివరాలను కోరే హక్కు, అధికారం తనకు అప్పిచ్చిన బ్యాంకులకు లేవని స్పష్టం చేసారు. తనకు విదేశాలలో ఉన్న ఆస్తులను చూసి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని కనుక ఆ వివరాలను తను బ్యాంకులకు తెలియజేయవలసిన అవసరం లేదని భావిస్తున్నట్లు విజయ్ మాల్యా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. భారత్ కి ఎప్పుడు తిరిగి వస్తారనే సుప్రీం కోర్టు ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. జూన్ 26వరకు సమయం ఇస్తే సీల్డ్ కవర్ లో తన ఆస్తుల వివరాలు సమర్పించగలనని చెప్పారు.
విజయ్ మాల్యా తను భారత్ నుంచి తప్పించుకొని లండన్ పారిపోయాను కనుక సేఫ్ అయిపోయానని భావిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన సుప్రీం కోర్టుకి కూడా ఈవిధంగా జవాబులు ఇస్తున్నారని భావించవలసి ఉంటుంది. కానీ ఆయన భౌగోళికంగా భారత్ సరిహద్దులు దాటిపోయినా ఈ కేసుల నుంచి తప్పించుకోలేరని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ఆయన తనంతట తాను భారత్ వచ్చే ఉద్దేశ్యం లేనట్లుగానే మాట్లాడుతున్నారు కనుక ఆయనపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి స్వదేశానికి తిరిగి రప్పించాలని ఈడి సిబీఐకి లేఖ వ్రాయబోతోంది.
విజయ్ మాల్యా యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకొన్నందుకుగాను ఆయనకు డియాజియో అనే సంస్థ 75 మిలియన్ డాలర్లు చెల్లించబోతోంది. అదిగాక మాల్యా కుటుంబానికి విదేశాలలో చాలా భారీగా ఆస్తులున్నాయి. అయినప్పటికీ ఆయన భారత్ లో బ్యాంకుల వద్ద తీసుకొన్న రూ.9,000 కోట్ల అప్పులను ఎగవేయాలనుకోవడం, బ్యాంకులు గట్టిగా ఒత్తిడి తేగానే లండన్ పారిపోవడం, తను ప్రవాస భారతీయుడునని వాదించడం వంటివన్నీ ఆయన మోసపూరిత గుణానికి అద్దం పడుతున్నాయి. గౌరవనీయమయిన రాజ్యసభ సభ్యుడుగా ఉన్న విజయ్ మాల్యా ఈవిధంగా ప్రవర్తించడమే పెద్ద తప్పు. పైగా తను ప్రవాస భారతీయుడనని చెప్పుకోవడం ఇంకా తప్పు.
ఆయన భారత్ లో తన వ్యాపారాల కోసం బ్యాంకుల వద్ద అప్పులు చేస్తున్నప్పుడు, రాజ్యసభ పదవి స్వీకరించినపుడు తను ప్రవాస భారతీయుడననే విషయం గుర్తురాలేదు కానీ తనకున్న విదేశీ ఆస్తుల వివరాలు ఇమ్మని సుప్రీం కోర్టు కోరినప్పుడు ఆ వివరాలు ఇవ్వకుండా తప్పించుకోనేందుకే తను ప్రవాస భారతీయుడనని చెప్పుకొంటున్నారని భావించవచ్చు. కనుక బ్యాంకుల వద్ద ఆయన తీసుకొన్న మొత్తం అప్పులను వడ్డీతో సహా వసూలు చేయడమే కాకుండా బ్యాంకులను ఉద్దేశ్యపూర్వకంగా మోసగించినందుకు, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు, ఈడి నోటీసులను బేఖాతరు చేసినందుకు, చెక్ బౌన్స్ కేసువంటి అన్ని నేరాలకు చట్ట ప్రకారం ఆయనను శిక్షించినపుడే అటువంటి ఆర్ధిక నేరస్తులకు తగిన గుణపాఠం చెప్పినట్లవుతుంది. మరి మోడీ ప్రభుత్వం వలన ఇవన్నీ సాధ్యమవుతాయో లేదో?