ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ఫోబియాతో బాధపడుతున్నారని వైకాపా నేత బి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన, మండల బీసి సెల్ కన్వీనర్ నాగాభూషణ్ యాదవ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ “ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ఫోబియా కారణంగా వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెదేపాలో చేర్చుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ముఖ్యమంత్రే అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు, పార్టీలో నేతలు, కార్యకర్తలు ఊరుకొంటారా? వారు కూడాయదేచ్చగా వివిధ పధకాలు, ప్రాజెక్టుల ముసుగులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు,” అని ఆరోపించారు.
వారి ఆరోపణల సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రికి జగన్ ఫోబియా ఉందనే వారి వాదనలో ఎంతో కొంత నిజముందని చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి తనకు ఏ విషయంలోనూ సరితూగడని ముఖ్యమంత్రి చెపుతున్నప్పుడు, ఆయన గురించి, వైకాపా గురించి ఆలోచించనవసరమే లేదు. కానీ ఆలోచిస్తున్నారంటే ఆయన వలన అభాద్రతాభావానికి గురవుతున్నారని అర్ధమవుతోంది. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రం నుంచి వైకాపాని పూర్తిగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్రంలో తెదేపాని చూసి ఈవిధంగానే తీవ్ర అభాద్రతాభావానికి లోనయ్యేవారు. దాని నుంచి బయటపడాలంటే దానికి ఏకైక మార్గం రాష్ట్రంలో తెదేపా కనబడకుండా తుడిచిపెట్టేయడమేనని భావించి తుడిచిపెట్టేశారు. గ్రేటర్ ఎన్నికలలో కూడా తెరాస తన సత్తా చాటుకొన్న తరువాత ఇంకా రాష్ట్రంలో తెదేపా, భాజపా, కాంగ్రెస్ పార్టీల వలన తెరాసకు ఎటువంటి ప్రమాదం లేదనే నమ్మకం కలిగింది. అందుకే పాలేరు ఉపఎన్నికలలో అప్పుడే తమ పార్టీ గెలిచేసినట్లు తెరాస నేతలు మాట్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి వైకాపాని తుడిచిపెట్టేయడం ద్వారా తనకి, తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్ కి, పార్టీకి, ప్రభుత్వానికి భవిష్యత్ లో జగన్మోహన్ రెడ్డి వలన ఎటువంటి సవాళ్లు ఎదురవకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తునట్లున్నారు. రాజకీయాలలో రాణించాలంటే వ్యక్తులయినా, పార్టీలయినా స్వతః సిద్దంగా కొన్ని శక్తియుక్తులు, అంగబలం, అర్ధబలం అన్నిటికీ మించి ప్రజాధారణ కలిగి ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇటువంటి వికృత ఆలోచనలు, ప్రయత్నాలు ఏదో కొంత కాలం పనిచేయవచ్చు తప్ప మన ప్రజాస్వామ్య వ్యవస్థలో శాస్వితంగా పనిచేసే అవకాశం లేదు.