ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కొన్ని సమావేశాలు ఆ పార్టీ భవిష్యత్తు గురించి చేస్తున్న ఆలోచనలకు నిదర్శనంగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం వంచించింది అనే ప్రచారం రాష్ట్రంలో ప్రజల్లో బాగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రం కోసం తాము చాలా చేశాం అనే సంగతిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని, కేంద్రం ఏమేం చేసిందో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సంకల్పించింది.
వారి సమావేశాల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నందుకు నిదర్శనం అన్నట్లుగా ప్రస్తుతం.. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అంతో ఇంతో కార్యకర్తల బలం ఉన్నచోట్ల విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రం ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి అందించిందో.. వాటిని చంద్రబాబు ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసిందో, లేదా నిధులను పక్కదారి మళ్లించిందో తెలియజెప్పేలా ప్రత్యేకంగా కరపత్రాలను ముద్రించి మరీ.. భాజపా కార్యకర్తలు పల్లెపల్లెకూ తిరుగుతూ… భారీ ఎత్తున ప్రచారం నిర్వహితస్తుండడం చూస్తే.. ఏపీలో అప్పుడే ఎన్నికల పర్వం వచ్చేసిందా అని సందేహం కలిగేంత జోరు కనిపిస్తోంది.
నిజానికి తెలుగుదేశం పార్టీ, భాజపా మిత్రపక్షాలుగానే ఏపీలో కొనసాగుతున్నాయి. కానీ, ఆద్యంతమూ ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇలాంటి పోకడలు జనానికి అనుమానాలు కలిగిస్తున్నాయి. కేంద్రం రాష్ట్రానికి చేయాల్సింది చేయకపోగా, అన్ని రాష్ట్రాలతో పాటూ.. మనకు కూడా వారి మౌలిక మైన విధుల్లో భాగంగా చేసిన మేలు గురించి ఇంత లావు ప్రచారం చేసుకోవడం ఏంటని జనం విస్తుపోతున్నారు. ఏపీ ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సంబంధించి.. రాజధానికి నిధులు, ప్రత్యేకహోదా లాంటివి అన్నీ మంటగలిపేసి.. కేంద్రం తరఫున అన్ని రాష్ట్రాలకు విదిల్చినట్లుగా ఇచ్చిన పథకాల గురించి అతిగా టముకు వేసుకోవడం ఏంటని జనం ఆలోచిస్తున్నారు.
అయితే భాజపా అనుసరిస్తున్న ధోరణులు తెదేపాతో సున్నం పెట్టుకునే తరహాలోనే సాగుతున్నాయని స్పష్టంగానే తెలుస్తున్నది. తెదేపా మాత్రం ఈ పరిణామాలన్నిటినీ మౌనంగానే గమనిస్తోంది. మరి భాజపా వీరి బంధాన్ని తెగేదాకా లాగుతుందో లేదో చూడాలి.