గుంటూరులో సన్నిధి కళ్యాణ మండపంలో శనివారం భాజపా నేతల మహాసభ జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, భాజపా జాతీయ మహిళా మోర్చా ఇన్-చార్జ్ డి. పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాం కిషోర్ తదితరులు హాజరవుతారు. జిల్లాలోని గ్రామస్థాయి నుంచి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
ఈ మహాసభ ప్రధానోదేశ్యం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సహాయసహకారాలు అందిస్తున్న నిధులు, రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాల గురించి జిల్లా నేతలకు వివరించి, వాటి గురించి గ్రామస్థాయి వరకు ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయడమే. తద్వారా కేంద్రం గురించి తెదేపా నేతలు చేస్తున్న దుష్ప్రాచారానికి చెక్ పెట్టి, కేంద్రం పట్ల ప్రజలలో నెలకొన్న అనుమానాలను, అపోహలను తొలగించి వారికి దగ్గర కావడం కోసమే ఈ ప్రయత్నం అని అర్ధమవుతోంది. ఇంతవరకు పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతలు అప్పుడప్పుడు తెదేపాను మొక్కుబడిగా విమర్శించడమే తప్ప ఈవిధంగా ఒక పద్ధతి ప్రకారం ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. కనుక ఇది చాలా మంచి ప్రయత్నమేనని చెప్పవచ్చు.
ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ వంటి హామీల గురించి రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండటం చేత ఒత్తిడికి గురవుతున్న తెదేపా ప్రభుత్వం కేంద్రప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తుండటం, కేంద్ర పధకాలను తన పధకాలుగా ప్రచారం చేసుకోవడం వలన రాష్ట్ర ప్రజలలో భాజపా పట్ల అపోహలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అందుకు వారిని నిందించడం కంటే రాష్ట్ర భాజపా నేతలు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే గత ఆరేడు దశాబ్దాలలో ఏనాడూ రాష్ట్రానికి రానన్ని అభివృద్ధి, సంక్షేమ పధకాలు గత రెండేళ్ళలోనే కేంద్రప్రభుత్వం అందించినప్పటికీ, రాష్ట్ర భాజపా నేతలు వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఆ కారణంగానే భాజపా, కేంద్రప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలలో అపోహలు, అనుమానాలు ఇంకా పెరిగాయి. పైగా దాని నిర్లక్ష్యం, అశ్రద్ధ కారణంగా తెదేపాకు మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ప్రజలకు కలిగేలా చేసింది. కనీసం ఇప్పటికయినా మేల్కొని ప్రజలలో నెలకొన్న ఆ అపోహలు దూరం చేయకపోతే భాజపాయే మూల్యం చెల్లించవలసి వస్తుంది.
అలాగే రాష్ట్రంలో తెదేపా పట్ల అది ప్రదర్శిస్తున్న అయోమయ వైఖరి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే, దానిని బట్టి రాష్ట్రంలో భాజపా ఏవిధంగా ముందుకు వెళ్ళాలో, వెళ్ళబోతోందో దానికీ, ప్రజలకీ, తెదేపాకి కూడా అర్ధం అవుతుంది. బహుశః రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంతో దానిపై స్పష్టత వస్తుందేమో. ఒకవేళ తెదేపాని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజుని అధ్యక్షుదిగా నియమిస్తే తెదేపాతో తెగతెంపులకి సిద్దం అవుతున్నట్లు, ప్రస్తుత అధ్యక్షుడు కంబంపాటి హరిబాబునే కొనసాగిస్తే, తెదేపాతో కలిసి సాగాలని కోరుకొంటున్నట్లు బావించవచ్చు.