ఇవ్వాళ్ళ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో తెలంగాణా రాష్ట్రాలో కరువుతో అల్లాడుతున్న రైతుల వ్యధకు అద్దం పడుతూ “మేము ఆత్మహత్య చేసుకొననవసరం లేదు ఎందుకంటే ఎలాగూ కరువుతో చచ్చిపోబోతున్నాము కనుక!” అని శీర్షికన ఒక కధనం ప్రచురించింది. అది చూస్తే చాలా బాధ కలుగుతుంది కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణాలో తెదేపా పరిస్థితి కూడా అక్షరాల అలాగే ఉందిపుడు. దానిని ఇంకా ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. దానంతట అదే క్రమంగా మాయమయిపోవచ్చు. కనుక ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నా, వెళ్ళిపోయినా దానికి పెద్ద తేడా ఉండదు.
ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి పి. రాములు నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరిపోయినప్పుడు “తెలంగాణాలో తెదేపాకు మరో ఎదురుదెబ్బ” అనే హెడ్డింగ్ తో మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చేయి. అవి చూసినప్పుడు ప్రజలు నవ్వుకోకుండా ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి కొత్తగా తగిలే ఎదురు దెబ్బలు ఏమీ చేయలేవు. అది ఇప్పటికే కోలుకోలేని స్థితికి చేరుకొంది. దాని అధినేత చంద్రబాబు నాయుడు దాని గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కనుక ఇంక ఎవరున్నా వెళ్ళిపోయినా ఆ పార్టీకి కొత్తగా వచ్చే లాభంకానీ నష్టం గానీ ఏమీ ఉండబోవు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెదేపాకి తెలంగాణాలో ఇటువంటి దయనీయమయిన పరిస్థితి ఏర్పడటం దాని అభిమానులకు బాధ కలిగిస్తుండవచ్చు కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత ఉంది. కనుక ఏవిధంగా చేస్తే గౌరవప్రదంగా పార్టీని మూసివేసుకోవచ్చో, పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఏవిధంగా తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవాలో ఇప్పుడే ఆలోచించుకొంటే మంచిదేమో? లేకుంటే ముందు ఇంకా అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు.
ఈవిధంగా ఆలోచించడం చాలా దుర్మార్గంగా కనిపించవచ్చు లేదా రాజకీయ దురుదేశ్యంతోనే సూచిస్తున్నట్లు కనబడవచ్చు కానీ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాస్తవిక దృక్పధంతో ఆలోచిస్తే ఇదే సరయినదని అంగీకరిస్తారు. లోక్ సత్తా పార్టీనే ఉదాహరణగా తీసుకొంటే అదికూడా ఇటువంటి వాస్తవిక దృక్పధంతోనే ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడం గమనించవచ్చు. కనుక తెలంగాణాలో తెదేపా కూడా తన భవిష్యత్ గురించి వాస్తవిక దృక్పధంతో ఆలోచించవలసిన సమయం ఇదే.