తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి అప్పుడప్పుడు బాంబులు పేలుస్తుంటారు…చాలాసార్లు ప్రతిపక్ష పార్టీల మీద..ఒక్కోసారి స్వంత పార్టీ మీద కూడా. ఈసారి ఆయన వైకాపా, జాతీయ పార్టీల మీద బాంబులు పేల్చారు. వైకాపా గండిపడిన ఒక జలాశయం వంటిదని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో జగన్ ఒక్కరే మిగులుతారని జోశ్యం చెప్పారు. దేశంలో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని ప్రకటించేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల కారణంగా భవిష్యత్ లో చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యంలేదని జోస్యం చెప్పారు.
వైకాపా విషయంలో ఆయన చెపుతున్న మాటలు అందరికీ తెలిసినవే. తెదేపా నేతలందరూ నిత్యం వల్లెవేస్తున్నవే. కనుక ఈ విషయంలో ఆయన జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే. ఒకవేళ పార్టీలో అందరూ ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయినా పైన దేవుడి, క్రిందన ప్రజల ఆశీసులు తనకే ఉన్నాయని జగన్ ఖచ్చితంగా చెపుతున్నారు కనుక భయపడాల్సిన పని లేదు. మహాభారత యుద్ధంలో పాండవుల వైపే దేవుడు ఉన్నాడు కనుక వారు విజయం సాధించగలిగారు. కనుక వచ్చే ఎన్నికల నాటికి జగన్ తో కలిపి ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలినా చాలు ఎంతమంది పార్టీని విడిచి పెట్టి పోయినా వర్రీ అవనవసరం లేదు.
జాతీయ పార్టీలకి ఇందిరాగాంధీ హయం నుంచే కాలం చెల్లింది. అందుకే అవి ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాయి. అలాగని ప్రాంతీయ పార్టీలేవీ కూడా తమంతట తాముగా కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతున్నాయి. రావాలనే ప్రయత్నంలో తృతీయ, చతుర్ధి, అష్టమి, నవమి, దశమి అంటూ ఎన్ని కూటములు కట్టినా అవి ఎన్నికలు మొదలయ్యే వరకు నిలబడటమే చాలా కష్టం అయిపోతోంది. అందరికీ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో అయిపోవాలనే కోరికే. అందుకే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయంగానే ఉండిపోవలసి వస్తోంది. వాటి ఆ బలహీనతే ఆ రెండు మూడు జాతీయ పార్టీలను కాపాడుతోంది..అందుకే అవి బ్రతికి బట్టకట్టగలుగుతున్నాయని చెప్పవచ్చు.
ఇంక చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారనే జోస్యం మంత్రి పదవి కోసమే. తనకు మంత్రి అవ్వాలని చాలా కోరికగా ఉంది కానీ చంద్రబాబు నాయుడు కనికరించడం లేదని జేసి దివాకర్ రెడ్డి డైరెక్టుగానే చెప్పేశారు. కనుక ఆయనకు ప్రధాని అయ్యే అవకాశాలున్నాయాని ఉబ్బెస్తే తనకు మంత్రి పదవి విదిలించకపోతారా? అనే కావచ్చు. నిజానికి చంద్రబాబు నాయుడుకి కూడా ప్రధాన మంత్రి అవ్వాలనే కోరిక మనసులో ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అది సాధయం కాదని గ్రహించడంతో ఆ కోరికను అణచివేసుకొన్నారు. దానిని జేసి దివాకర్ రెడ్డి క్యాచ్ చేసి ఆయనను ప్రసన్నం చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లున్నారు.