తెలంగాణాలో పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. మరణించిన ఎమ్మెల్యే స్థానంలో వారి కుటుంబ సభ్యులని పోటీ పెట్టేట్లు అయితే.. ఏకగ్రీవం చేయడం అనే సంప్రదాయం మీద కాంగ్రెస్ అసలు పెట్టుకుంటున్నది. తెరాస ఇప్పటికే అభ్యర్థిని పొరకటించేసి, జోరుగా ఉండగా.. కనీసం టీడీపీ పోటీ లో లేకుండా చేసుకుంటే తమకు అడ్వాంటేజ్ ఉంటుందని కాంగ్రెస్ కల కంటోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… టీడీపీ అధ్యక్షుడు రమణ కు ఫోన్ చేసి, పాలేరులో తమకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరడం దీనికి నిదర్శనం.
ఎటూ తెరాస తో పోటీ తప్పదని తెలిపోయిన నేపథ్యంలో టీడీపీ వోట్లు కూడా తాము దక్కించుకోవడానికి కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా టీడీపీ తమ అభ్యర్థి అనుకుంటున్నా నామా నాగేశ్వర రావు.. నిన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, వారి కుటుంబ అభ్యర్థి రంగంలో ఉన్నప్పుడు ఏకగ్రీవం చేయడం సంప్రదాయం అని సానుభూతి వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందని వారు ఆశించడంలో తప్పు లేదు.
అందుకే ఉత్తమ్ కుమార్, రమణ కు ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తున్నది. వీరిద్దరూ కలసి బరిలోకి దిగితే, తెరాస కు పరిస్థితి కాస్త ఇబ్బంది అవుతుందనడంలో సందేహం లేదు. అయితే రమణ మాత్రం, తమ అధినేత తో సంప్రదించి ఏ విషయం చెబుతాం అని అన్నారు. నిజానికి టీడీపీ బరిలో ఉన్నప్పటికీ సాధించేది ఏమి ఉండదని, కనీసం కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెబితే, సంప్రదాయం పాటించిన సానుభూతి వస్తుందని, కాస్తో కూస్తో మంచి పేరు దక్కుతుందని పార్టీ నాయకులు అంటున్నారు.